Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నుంచి శనివారం నోటీసులు పంపారు. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు లబ్ది పొందారని రామ్ గోపాల్ వర్మతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులు పంపారు. రూ.2.15 కోట్ల ఒప్పందం చేసుకొని రూ. 1.15 కోట్ల చెల్లింపులపై నోటీసులు ఇచ్చామని ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. వ్యూస్ ప్రకారం డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని.. వ్యూహం సినిమాకు 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయని ఆయన తెలిపారు.
ఈ లెక్కన ఒక్కో వ్యూకు రూ.11 వేలు చొప్పున చెల్లించారని పేర్కొన్నారు. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి..అనుచిత లబ్ధి పొందారని.. దీనిపై వివరణ కోరుతూ వ్యూహం సినిమాకు లీగల్ నోటీస్ ఇచ్చినట్లు ఏపీ ఫైబర్ నెట్ తెలిపింది. రామ్ గోపాల్ వర్మ, అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా ఐదుగురికి ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, 2024 మార్చిలో వ్యూహం సినిమా విడుదలైంది. ఏపీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో తమపై అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు.