Site icon HashtagU Telugu

EAGLE : విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు.. మాదకద్రవ్యాలపై వ్యతిరేక పోరు

Drugs

Drugs

EAGLE : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నివారణకు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, విద్యాసంస్థల్లోనూ మాదకద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ (EAGLE – Eradication of Addiction in Growth and Learning Environment) క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఈ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.

విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాలపై పోరాటం
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, జూనియర్‌ కళాశాల, డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో క్లబ్‌లో ఓ ఉపాధ్యాయుడు లేదా లెక్చరర్, విద్యార్థుల సహా మొత్తం 10 మంది సభ్యులుగా ఉంటారు. ఈ క్లబ్ పదవీకాలం ఒక సంవత్సరం వరకు కొనసాగనుంది. ఈ గడువు పూర్తయిన తర్వాత కొత్త సభ్యులను ఎంపిక చేసి క్లబ్‌ కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంటుంది.

Elephant Idols: ఇంట్లో ఏనుగు బొమ్మ ఉంటే అదృష్టం కలిసివస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

క్లబ్ కార్యకలాపాలు
ఈగల్ క్లబ్‌లు ప్రధానంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాయి.

ఇందులో భాగంగా.. అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం.. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల ప్రభావంపై విద్యార్థులను చైతన్య పరచడం.. విద్యాసంస్థల పరిసరాల్లో నిషేధిత మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టడం.. విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై మార్గదర్శనం అందించడం..

మాదకద్రవ్యాలపై ప్రభుత్వ తీవ్రస్థాయిలో చర్యలు
ఇటీవల కాలంలో విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న వయస్సులోనే విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతూ, తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారని పలువురు శిక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం విద్యాసంస్థల నుంచే చైతన్యం కల్పించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో మానసిక ధృడత పెంపొందించి, మత్తు పదార్థాల దారిలోకి వెళ్లకుండా కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇకపై విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ వినియోగం పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.

మాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యా వర్గాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు స్వాగతిస్తున్నప్పటికీ, దీన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం పాఠశాలలు, కళాశాలలు, పోలీస్‌శాఖ, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
విద్యార్థులకు సరైన మార్గదర్శనం ఇవ్వడం ద్వారా మాదకద్రవ్యాల బారినపడకుండా వారిని కాపాడే అవకాశం ఉంటుంది.

ఇకపై విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల వినియోగం ఉండదన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం, రాష్ట్రంలోని విద్యార్థులకు మేలైన భవిష్యత్‌ను అందించేందుకు దోహదపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Gummadi Sandhya Rani : 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తాం..