Site icon HashtagU Telugu

Pawan Kalyan : వరద ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన

Ap Deputy Cm Pawan Kalyan V

AP Deputy CM Pawan Kalyan visit to flood areas

AP Deputy CM visit to flood affected areas: నేడు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వరద పరిస్ధితిపై సమీక్ష నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత పిఠాపురం వెళ్లారు. కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. స్ధానికంంగా బోటులో ప్రయాణించి వెళ్లి మరీ వరద బాధితుల్ని కలుసుకున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ముంపు సమస్య నుంచి వారిని కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం తప్పులకు ప్రజలు నష్టపోయారు..

ఏలేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు పవన్ సూచించారు. సుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీలు పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని, ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో సరి చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనేశారని, రూ. 30 లక్షల ఎకరా భూమి మార్కెట్ ధరను రూ.60 లక్షలు చెల్లించి కొన్నారని పవన్ ఆరోపించారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నాం. ప్రజల బాధలు వెతలు స్వయంగా పరిశీలించేందుకే ఈ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానని పవన్ తెలిపారు.

ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు ఉన్నారు..

గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని, కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు. బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలన్నారు. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారు. ముందుగా ఆక్రమణలు గుర్తించి అందరితో కలిసి కూర్చుని మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రమంతటా ఈ వర్షాలున్నాయన్నారు.

Read Also: Supreme Court : ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం..తాము జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు