జనసేనాని పవన్ మీద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వేదికగా ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా జనసేనాని వ్యవహిస్తున్నారని ఆరోపించారు. దుష్టచతుష్టయానికి పవన్ తోడయ్యాడని దుయబట్టారు. దత్తపుత్రుడితో కలిసి ఆ నలుగురు దోచుకో-పంచుకో-తినుకో విధానంను చంద్రబాబు హయాంలో అమలు చేశారని తీవ్ర ఆరోపణలను గుప్పించారు.
ప్రస్తుతం ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ది దారుని ఎకౌంట్ లో నగదు జమ అవుతుందని జగన్ వివరించారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువు మండలాల ప్రకటన చేయాల్సి వచ్చేదని సెంటిమెంట్ పాయింట్ తీశారు. కరువు, బాబు స్నేహితులంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆళ్లగడ్డ వేదికగా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ ఏడాది రెండో విడత నిధులను సీఎం విడుదల చేసారు. మొత్తం 50.92 లక్షల మంది రైతులకు రూ 2,096.04 కోట్లు ఈ విడతలో అందనుందని వెల్లడించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ 13,500 చొప్పున ఇప్పటి వరకు 51 వేలు అందించామని సీఎం వివరించారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ వేదికపై ప్రస్తవించారు. గతంలో చంద్రబాబు తీసుకున్న రుణాల కంటే ప్రస్తుతం ఎక్కువగా లేదని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, ప్రభుత్వానికి రాబడి కూడా పెరుగుతుందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా టార్గెట్ చేస్తుందని తెలిపారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు ఆయన తెలియచేశారు. దత్తపుత్రుడుగా ఉన్న పవన్ ఆ మీడియాతో కలిసి నడుస్తున్నాడని ఆరోపించారు. మొత్తం మీద విశాఖ గర్జన క్రమంలో పవన్ చేసిన హడావుడిపై పరోక్షంగా జగన్ స్పందించారు.