AP BJP : రెండోసారి బీజేపీ ఏపీ చీఫ్ గా సోము, జ‌న‌సేన‌లోకి `క‌న్నా`? బీజేపీ ఖాళీ!

ఏపీ బీజేపీ (AP BJP)పోరు తారాస్థాయికి చేరింది.

  • Written By:
  • Updated On - January 26, 2023 / 01:45 PM IST

ఏపీ బీజేపీ (AP BJP) అంత‌ర్గ‌త పోరు తారాస్థాయికి చేరింది. అక్క‌డ రెండు శాతానికి మించి ఓటు బ్యాంకు లేక‌పోయిన‌ప్ప‌టికీ లీడ‌ర్ల మ‌ధ్య పొంత‌న లేకుండా ఉంది. బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోమువీర్రాజు(Somu), మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భగ్గ‌మ‌నేలా వివాదం నెల‌కొంది. రెండోసారి కూడా సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్య‌క్షుడుగా నియ‌మిస్తూ ఢిల్లీ పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. దీంతో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీ మారడానికి మార్గాన్ని సుగ‌మ‌మం చేసుకుంటున్నారు. రేపోమాపో జ‌న‌సేన గూటికి చేర‌డానికి సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

ఏపీ బీజేపీ అంత‌ర్గ‌త పోరు(AP BJP) 

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ప‌నిచేసిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత రాజ‌కీయంగా వెనుక‌బ‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేర‌డానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే, చివ‌రి నిమిషంలో ఆయ‌న్ను బీజేపీ ఆక‌ర్షించింది. ఏపీ బీజేపీ (AP BJP) అధ్య‌క్షుడుగా ఛాన్స్ ఇచ్చారు. అయితే, 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబుకు అమ్ముడుపోయాడ‌ని స‌ర్వ‌త్రా వినిపించిన ఆరోప‌ణ‌లు. అదే వాయిస్ ను ఢిల్లీ పెద్ద‌ల వ‌ద్ద వినిపించిన వాళ్ల‌లో సోము(Somu) వీర్రాజు ప్ర‌ధానంగా ఉన్నారని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అంతేకాదు, పార్టీ అధ్యక్ష ప‌ద‌వి నుంచి క‌న్నా ల‌క్ష్మీనార‌య‌ణ‌ను త‌ప్పించే వ‌ర‌కు రాజ‌కీయాన్ని న‌డిపార‌ని టాక్‌. అందుకే, వాళ్లిద్ద‌రి మ‌ధ్యా తొలి నుంచి గ్యాప్ ఏర్ప‌డింది.

Also Read : AP BJP Chief : టీడీపీ, వైసీపీపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్‌.. ఆ విధానాల వ‌ల్లే..?

తాజాగా సోము వీర్రాజు మీద కూడా బీజేపీలోని కొంద‌రు అధిష్టానం వ‌ద్ద ఫిర్యాదు చేశారు. ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌ను కూడా చేర‌వేశారు. ఢిల్లీ స‌మావేశాల్లోనూ వీర్రాజు నాయ‌క‌త్వంపై పెద్ద‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు న్యూస్ వ‌చ్చింది. బీజేపీ ఏపీ అధ్య‌క్షుడుగా ఆయ‌న్ను తొల‌గిస్తార‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రిగింది. అందుకే, ఇంత కాలం క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మౌనంగా ఉన్నారు. రెండో రోజుల క్రితం భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రిగిన రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం తిరిగి వీర్రాజును అధ్య‌క్షునిగా అంగీక‌రిస్తూ తీర్మానం చేసింది. దీంతో బీజేపీ నుంచి వెళ్లిపోవ‌డానికి క‌న్నా సిద్ధ‌మ‌య్యారు. పైగా బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశానికి డుమ్మా కొట్టారు.

జ‌న‌సేన స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ప‌నిచేసిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సుమారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడు, గుంటూరు వెస్ట్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన చ‌రిత్ర ఉంది. ఇప్పుడు స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబ‌టి రాంబాబు మీద స‌త్తెన‌ప‌ల్లి ప్ర‌జ‌లు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని స‌ర్వేల సారాంశం. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు సామాజిక‌వ‌ర్గం కూడా ఎక్కువ‌గా ఉంది. పైగా టీడీపీ ఇంచార్జిను కూడా నియ‌మించ‌కుండా ఖాళీగా పెట్టింద‌ట‌. జ‌న‌సేన‌, టీడీపీ పొత్తులో భాగంగా వ్యూహాత్మ‌కంగా టీడీపీ ఇంచార్జిని పెట్ట‌లేద‌ని తెలుస్తోంది. అందుకే, జ‌న‌సేన నుంచి స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేయ‌డం బెట‌ర్ అనే అభిప్రాయానికి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌చ్చార‌ని ఆయ‌న అనుచరుల్లోని టాక్.

Also Read : AP CM : ఒంగోలు అభ్య‌ర్థిగా పురంధ‌రేశ్వ‌రి? మ‌హారాష్ట్ర త‌ర‌హా గేమ్ కు BJP స్కెచ్!

మొత్తం మీద రెండోసారి బీజేపీ ఏపీ చీఫ్ గా సోము వీర్రాజును కొన‌సాగిస్తూ రాష్ట్ర కార్య‌వ‌ర్గం నిర్ణ‌యంతో పాటు టీడీపీ, జ‌న‌సేన పొత్తు వ్య‌వ‌హారంపై క్లారిటీ వ‌స్తోంది. ఫ‌లితంగా బీజేపీ సీనియ‌ర్లు ఆ పార్టీని వీడి వెళ్లిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు టీడీపీతో పొత్తుకు ముందుకు రావ‌డంలేద‌ని తెలుసుకున్న బీజేపీ ఏపీ నేత‌లు ఆ పార్టీని వీడ‌బోతున్నారు. అలాంటి వాళ్ల జాబితాలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ముందుండ‌గా, మ‌రికొంద‌రు ఆయ‌న బాట‌న న‌డుస్తున్నార‌ని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రాబోవు రోజుల్లో వీర్రాజు, పొత్తుల ప‌రంప‌ర దెబ్బ‌కు బీజేపీ ఖాళీ కానుంద‌ని ప్ర‌త్య‌ర్థులు అంచ‌నా వేస్తున్నారు. ఎక్కువ మంది బీజేపీ నుంచి జ‌న‌సేన వైపు మ‌ళ్లుతుండ‌గా, మ‌రికొంద‌రు టీడీపీ గూటికి ద‌గ్గ‌ర‌వుతున్నారు. సీట్ల స‌ర్దుబాటు కూడా టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య తెర‌వెనుక న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. అందుకే, ముందుగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.