Somu Veerraju : పాపం వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ఎక్క‌డికి వెళ్లినా పరాభ‌వం త‌ప్ప‌డంలేదు. ఢిల్లీ నుంచి రాష్ట్రం వ‌ర‌కు ఏదో ఒక సంద‌ర్భంలో ఆయ‌న అభాసుపాల‌వుతున్నారు.

  • Written By:
  • Updated On - November 22, 2022 / 02:47 PM IST

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ఎక్క‌డికి వెళ్లినా పరాభ‌వం త‌ప్ప‌డంలేదు. ఢిల్లీ నుంచి రాష్ట్రం వ‌ర‌కు ఏదో ఒక సంద‌ర్భంలో ఆయ‌న అభాసుపాల‌వుతున్నారు. ఇటీవ‌ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విశాఖ వ‌చ్చిన సంద‌ర్భంగా `ఆప్ కా నామ్ క్యా హై` అంటూ ప్ర‌శ్నించారు. దీంతో ఆయన గ్రాఫ్ బీజేపీ అధిష్టానం వ‌ద్ద ఎలా ఉందో స్ప‌ష్టం అయింది. ఇప్పుడు విశాఖ‌లోని సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆయ‌న్ను అడ్డుకోవ‌డం రాష్ట్రంలోనూ ఆయ‌నకు త‌గిన గౌర‌వం లేద‌ని బోధ‌ప‌డుతోంది.

బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు అయిన త‌రువాత ఆయ‌న మీద జగన్ మోహన్ రెడ్డి ముద్ర ప‌డింది. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుకు వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేకిగా గుర్తించిన ఆయ‌న్ను అధ్య‌క్ష ప‌ద‌వికి ఎక్కించ‌డం వెనుక వైసీపీ ఉంద‌ని ఆనాడు ప్ర‌చారం జ‌రిగింది. అందుకు త‌గిన విధంగా తొలి రోజుల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత అధిష్టానం త‌లంట‌డ‌డంతో ప‌ద్ధ‌తి మార్చుకున్నార‌ని ఆ పార్టీలోని వాళ్లే చెప్పుకుంటారు. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన ఏపీ బీజేపీ కోర్ క‌మిటీ స‌మావేశం సంద‌ర్భంగా అమిత్ షా ఆయ‌న మీద సీరియ‌స్ అయ్యార‌ని న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడ్ని మార్చేస్తార‌ని కూడా ప్ర‌చారం బ‌లంగా జ‌రుగుతోంది. అందుకు నిద‌ర్శ‌నం విశాఖ కేంద్రంగా ఆయ‌న‌కు జ‌రిగిన అవ‌మానాలుగా ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read:  YS Jagan Meeting : జ‌గన్ స‌భ `ఒక్క ఫోటో`వందరెట్ల అభ‌ద్ర‌త‌!

విశాఖపట్నంలో కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ బీజీపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఆ కార్యక్రమానికి వెళ్లారు. అయితే ఆయనను లోపలకు వెళ్లనీయకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. గమనించిన కిషన్ రెడ్డి లోపలకు అనుమతించమని చెప్పడంతో వీర్రాజుకు ఉప‌శ‌మ‌నం క‌లిగింది. ఇటీవ‌ల భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కూడా ఆయ‌న‌కు విలువ‌లేకుండా పోయింది. ఇవ‌న్నీ చూస్తే పాపం వీర్రాజు పేరుకు అధ్య‌క్షుడేగానీ అందుకుత‌గిన విలువ‌లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.