Site icon HashtagU Telugu

AP Assembly : చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

AP Assembly approves Garbage Tax Abolition Bill

AP Assembly approves Garbage Tax Abolition Bill

Garbage Tax Abolition Bill : గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు చెత్త పన్ను రద్దు బిల్లును ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను విధించిందని అన్నారు. రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త సేకరణకు నెలకు రూ.51,641 నుంచి రూ.62,964 వరకు చెల్లించారని ఆరోపించారు. నివాస గృహాల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.120 వరకు సేకరించారని… కమర్షియల్ కాంప్లెక్స్ ల నుంచి రూ.100 నుంచి రూ.10 వేల వరకు సేకరించారని వెల్లడించారు. చెత్త పన్నును నిరసిస్తూ మహిళలు నాడు ధర్నాలు కూడా చేశారని మంత్రి నారాయణ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇక , ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ సహజవాయువు వినియోగంపై జీఎస్టీని 24 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ.. సవరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వైఎస్‌ఆర్‌సిపి హయాంలో సహజవాయువుపై పన్నును 5 నుంచి 24 శాతానికి పెంచటం వల్ల ఆదాయం కోల్పోయామని మంత్రి పయ్యావుల అన్నారు. ఏపీలో అత్యధిక పన్ను కారణంగా పరిశ్రమలు పొరుగు రాష్ట్రాల నుంచి సహజ వాయువును తెచ్చుకుని కేవలం 2 శాతం మాత్రమే పన్ను కట్టారని వెల్లడించారు. అందుకే రాష్ట్ర ఆదాయంతో పాటు ప్రజలకు భారం తక్కువ ఉండేలా సహజ వాయువుపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ మంత్రి పయ్యావుల కేశవ్‌ బిల్లు పెట్టారు.

Read Also: Lagacharla incident : పోలీసులపై హైకోర్టులో నరేందర్‌ భార్య పిటిషన్