Jogiramesh : మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత జోగి రమేష్(Jogiramesh) నివాసంలో ఇవాళ తెల్లవారుజామునే ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. ఇబ్రహీం పట్నంలోని ఆయన నివాసంలో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆయన హౌసింగ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అప్పట్లో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తీసుకున్న పలు నిర్ణయాలతో ముడిపడిన సమాచారాన్ని సేకరించేందుకే ఏసీబీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 మంది ఏసీబీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
అగ్రిగోల్డ్ భూముల విషయంలో గతంలో జోగిరమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములను కబ్జా చేసి రూ.5కోట్ల పైచిలుకు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలతో ఈ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంబాపురంలో ఆర్‌ఎస్ నం.69/2, రీసర్వే నం.87లో అగ్రిగోల్డ్‌కు చెందిన 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. గతంలో దీన్ని ఏపీ సీఐడీ అటాచ్‌మెంట్ చేసుకుంది. అయితే వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ మంత్రి జోగి కుటుంబం ఈ భూములపై కన్నేసింది. జోగి రమేశ్ బాబాయి జోగి వెంకటేశ్వరావు, జోగి తనయుడు జోగి రాజీవ్ కలిసి చెరో 1,086, 1,074 గజాలను తమపేరిట రాయించుకున్నారనే అభియోగాలు ఉన్నాయి.
Also Read : CM Revanth : తెలంగాణలో హ్యుందాయ్ కారు మెగా టెస్ట్ సెంటర్ : సీఎం రేవంత్
అంబాపురంలో ఆర్‌ఎస్ నం.88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమకు ఉన్న భూమిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డికి అమ్మారు. ఆయన ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్‌కు విక్రయించారు. ఆయన మహాలక్ష్మీ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్టెమెంట్స్‌కు చెందిన అడుసుమిల్లి మోహన రామదాసుకు 3,800 గజాలు అమ్మారు. చివరకు మోహన రామదాసు నుంచి 2022లో జోగి వెంటేశ్వరరావు, జోగి రాజీవ్ కలిసి 2,160 గజాలు కొన్నారు. దీన్ని వెంటనే 200 గజాలు ప్లాట్లుగా వేసి ఏడుగురు వ్యక్తులకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. సర్వే నం.88లో తాము కొన్న భూమి దస్తావేజుల్లో తప్పు దొర్లిందని బుకాయిస్తూ 2023 సంవత్సరంలో స్వీయ సవరణ చేయించారు. అయితే ఆ సమయంలో అగ్రి గోల్డ్ భూములున్న సర్వే నంబరు 87ను అసలుదిగా పేర్కొన్నారు. అగ్రి గోల్డ్ భూమిని కాజేయడానికి వేసిన ఎత్తుగడే ఈ స్వీయ సవరణ అని ఏపీ ఏసీబీ వర్గాలు అనుమానిస్తున్నాయి. అది సీఐడీ అటాచ్‌మెంటులో ఉన్న భూమి అని తెలియక కొనుగోలుదారులు జోగి వెంటేశ్వరరావు, జోగి రాజీవ్ నుంచి దాన్ని కొనేశారు. విక్రయించగా మిగిలిన 800 గజాల్లో జోగి కుటుంబం ప్రహరీ నిర్మించుకునే ప్రయత్నంలో ఉంది. ఈక్రమంలో తాజాగా అగ్రి గోల్డ్‌కు చెందిన అవ్వా వెంకట శేషు నారాయణరావు విజయవాడ టూటౌన్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. వివాదా స్పద అగ్రిగోల్డ్ భూముల్ని జోగి కుటుంబం విక్రయించారని పేర్కొంటూ విజయవాడ రూరల్ తహశీల్దార్ కూడా నివేదిక ఇచ్చారు.