పొలిటిక‌ల్ బాంబ్ రెడీ! ‘రెక్కీ’ ర‌హ‌స్యం!!

వంగ‌వీటి రాధాపై రెక్కీ ఎవ‌రు నిర్వ‌హించారు? టీడీపీ నేత ప‌ట్టాభి ఇంటిపై దాడి, రాధ రెక్కీకి సంబంధం ఉందా? రంగా వ‌ర్థంతి రోజు వ‌ర‌కు రెక్కీ విష‌యాన్ని ర‌హ‌స్యంగా రాధా ఎందుకు ఉంచాడు? ఏపీ రాజ‌కీయాల‌ను `రెక్కీ` మ‌లుపు తిప్ప‌బోతుందా? అనే ప్ర‌శ్న‌లే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

  • Written By:
  • Publish Date - December 27, 2021 / 02:31 PM IST

వంగ‌వీటి రాధాపై రెక్కీ ఎవ‌రు నిర్వ‌హించారు? టీడీపీ నేత ప‌ట్టాభి ఇంటిపై దాడి, రాధ రెక్కీకి సంబంధం ఉందా? రంగా వ‌ర్థంతి రోజు వ‌ర‌కు రెక్కీ విష‌యాన్ని ర‌హ‌స్యంగా రాధా ఎందుకు ఉంచాడు? ఏపీ రాజ‌కీయాల‌ను `రెక్కీ` మ‌లుపు తిప్ప‌బోతుందా? అనే ప్ర‌శ్న‌లే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధ చాలా కాలంగా రాజ‌కీయంగా త‌డ‌బడుతూ ఉన్నాడు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయ‌డానికి 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు వైసీపీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేయాల‌ని జ‌గ‌న్ ఆనాడు ఆదేశించాడు. దీంతో అర్థ‌రాత్రి చంద్ర‌బాబు చెంత‌కు చేరాడు.ఆనాడున్న ప‌రిస్థితుల్లో రాధ‌కు టీడీపీ టిక్కెట్ ల‌భించ‌లేదు. ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్రామిస్ చేయ‌డంతో పార్టీ కోసం ప‌నిచేశాడు. కానీ. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేల‌కు పరిమితం కావ‌డంతో హామీని చంద్ర‌బాబు నెర‌వేర్చ‌లేక‌పోయాడు. దీంతో దాదాపు రాజ‌కీయ మౌనాన్ని రాధ పాటిస్తున్నాడు. కానీ, రంగా వ‌ర్థంతి రోజున ఏదో ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తున్నాడు. ఈ సారి33వ రంగా వ‌ర్థంతి సంద‌ర్భంగా `రెక్కీ` అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చాడని బెజ‌వాడ టాక్.

Also Read : మంత్రి కొడాలి నాని సాక్షిగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వంగ‌వీటి రాధా.. ?

తెలుగుదేశం పార్టీ ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉంది. నారా లోకేష్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ అనేక ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై పోరాడుతున్నారు. వాళ్లకు అండ‌గా నిలిచేలా రాధ ఏనాడూ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవు. పార్టీ ఆఫీస్ ల‌పై దాడులు చేయ‌డాన్ని నిర‌సిస్తూ చంద్ర‌బాబు చేసిన దీక్ష స‌మ‌యంలోనూ రాధా రోల్ నామ‌మాత్ర‌మే. ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని టీడీపీ 2019 ఎన్నిక‌ల్లో అక్కున చేర్చుకుంది. కానీ, విజ‌య‌వాడ కేంద్రంగా ఆయ‌న ప్ర‌భావం పెద్ద‌గా లేద‌ని ఫ‌లితాల త‌రువాత పార్టీ వ‌ర్గాలు గ్ర‌హించాయి. ఆనాటి నుంచి రాధ‌కు ప్ర‌త్యేకంగా పార్టీ కూడా ప్రాధాన్య‌త ఇచ్చిన సంద‌ర్భాలు లేవు. ఆయ‌న కూడా పార్టీకి దాదాపుగా దూరంగా ఉంటున్నాడు. త్వ‌ర‌లోనే పార్టీకి గుడ్ బై చెబుతాడ‌ని త‌ర‌చూ ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్, ప్ర‌జారాజ్యం, జ‌న‌సేన‌, టీడీపీ….ఇలా చాలా పార్టీలు మారాడు. గెలుపుతో పాటు ఓట‌ములు కూడా ఆయ‌న‌కు ఎక్కువే.గుడివాడ టీడీపీ అభ్య‌ర్థిగా రాధ ఈసారి పోటీ చేస్తాడ‌ని ఇటీవ‌ల బ‌లంగా ప్ర‌చారం జ‌రిగింది. దానికి బ‌లంచేకూరేలా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన సంఘ‌ట‌న ఉంది. అనుచ‌రులు స‌ర్వేలు కూడా చేయించార‌ని టాక్ ఉంది. జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు దిశ‌గా వెళుతున్నందున..ఈసారి జ‌న‌సేన అభ్య‌ర్థిగా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ లేదా గుడివాడ నుంచి బ‌రిలోకి దిగుతాడ‌ని తాజా ప్ర‌చారం. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తాడ‌ని ఇంకో ప్రచారం కూడా రంగా వ‌ర్థంతి వేదిక‌ను బేస్ చేసుకుని మొద‌లైయింది.

Also Read : ఆన్ లైన్ సర్వదర్శనం టికెట్స్..15 నిమిషాల్లోనే అన్నీ ఖాళీ!

మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, వంగ‌వీటి రాధా ముగ్గురూ ఒకే వేదిక‌పై విజ‌య‌వాడ కేంద్రంగా క‌నిపించారు. స్వ‌ర్గీయ రంగా 33వ వర్థంతి సభ‌కు ఈ ముగ్గురూ హాజ‌ర‌య్యారు. ఆ వేదిక‌పై నుంచి రెక్కీ వ్య‌వ‌హారాన్ని రాధా బ‌య‌ట‌పెట్టాడు. అంటే, రెక్కీ వ్యవ‌హారం వైసీపీకి సంబంధంలేనిదిగా భావించాలి. పైగా రాధాను బంగారంగా మంత్రి కొడాలి పోల్చాడు. కొంత రాగి క‌లిపితే మంచి ఆభ‌ర‌ణంగా త‌యారు అవుతుంద‌ని ప‌రోక్షంగా వైసీపీలోకి రావాల‌ని సూచించాడు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్, వైఎస్ఆర్ చ‌రిష్మాల‌తో పోల్చుతూ వంగ‌వీటి కుటుంబాన్ని వంశీ ఆకాశానికి ఎత్తాడు. అటు వంశీ ఇటు కొడాలి వ్యాఖ్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే…రాధాను వైసీపీ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం అవుతోంది.ఇక ఇప్పుడు రాధా మీద రెక్కి నిర్వ‌హించ‌డం వెనుక ఎవ‌రున్నార‌నే ప్ర‌శ్న వేసుకుంటే..గుణ‌ద‌ల బ్యాచ్ ఉండొచ్చ‌ని బెజ‌వాడ‌లోని ఒక వ‌ర్గం టాక్. ఆ గుణ‌ద‌ల బ్యాచ్ ఎవ‌రో…అక్క‌డి వాళ్ల‌కు తెలిసుంటుంది. ప‌ట్టాభి పై దాడి జ‌రిగిన రోజే రెక్కీ జ‌రిగింద‌ని ఒక క్లూను కొంద‌రు వ‌దిలారు. రెక్కీ నిర్వ‌హించిన వాళ్లు ఎవ‌రో..తెలుసని రాధా అంటున్నాడు. స‌మ‌యం సంద‌ర్భం చూసి చెబుతా అంటున్నాడు.ఒక‌ వేళ ఆయ‌న‌కు `రెక్కీ` చేసిన వాళ్లు తెలిస్తే..పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలి. ఆ ప‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేయ‌లేదు. పైగా రెక్కీ నిర్వ‌హించిన వాళ్ల వీడియోలు కూడా ఉన్నాయ‌ని ఆయ‌న వ‌ర్గీయులు అంటున్నారట‌. ఆ వ్యాఖ్య‌ల‌ను సుమోటోగా తీసుకుని పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయాలి. అదీ జ‌ర‌గ‌లేదు. సో..రాధా మీద ఎవ‌రు `రెక్కీ` నిర్వ‌హించి ఉంటార‌నే అనే ప్ర‌శ్న వేసుకుంటే చిర‌కాల శ‌త్రువ‌ర్గ‌మా? లేక రాజ‌కీయం కోణ‌మా అనే అనుమానం వ‌స్తుంది. వీటికి ఫుల్ స్టాప్ ప‌డాలంటే రాధా నిజాలను బ‌య‌ట‌పెట్టాలి. అదే జ‌రిగితే, ఒక పెద్ద పొలిటిక‌ల్ బాంబ్ బెజ‌వాడ‌లో పేల‌నుంద‌న్న‌మాట‌.