Site icon HashtagU Telugu

YS Jagan Sattenapalli Tour : మరో ప్రాణం పోవడానికి జగన్ పరోక్షంగా కారణమయ్యాడు

Another Tragic Incident

Another Tragic Incident

మరో ప్రాణం పోవడానికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ (Jagan) పరోక్షంగా కారణమయ్యాడు. జూన్ 18న జగన్ సత్తెనపల్లి పర్యటన (Sattenapalli Tour) చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించగా..మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు మరో ప్రాణం గాల్లో కలిసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లికి చెందిన 22 ఏళ్ల తెల్లజర్ల మధు (Madhu) అనే యువకుడు జూన్ 18 న బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలాడు.

అతడిని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా, జగన్ పర్యటన కారణంగా కార్యకర్తల ర్యాలీ అంబులెన్స్‌కు అడ్డుపడింది. దాదాపు గంటసేపు ట్రాఫిక్‌లోనే చిక్కుకున్న మధు అప్పటికే అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మధు ఆరోగ్యం విషమంగా మారింది. ఓ రోజు పాటు చికిత్స చేసినప్పటికీ మధు బ్రతకలేదు. గంట ముందు హాస్పటల్ కు తీసుకొస్తే మీ కొడుకు బ్రతికేవాడు అని డాక్టర్స్ చెప్పడం తో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

“ఒక గంట ముందే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే ప్రాణాలు నిలిచేవి” అని, వైసీపీ కార్యకర్తలు అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని, ఎంత ప్రాధేయపడినా కనికరం చూపలేదని కుటుంబ సభ్యులు , సన్నిహితులు ఆరోపిస్తున్నారు. మధు తల్లి తండ్రులు భోరున విలపిస్తూ, జగన్ పర్యటన వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ హడావుడి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం తగదని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటన వల్ల పరోక్షంగా మూడు ప్రాణాలు పోయాయని అధికార పార్టీ నేతలు వాపోతున్నారు.

Exit mobile version