YSRCP: వైకాపా (YSRCP) పార్టీకి వరుస షాక్‌లు ఆగడం లేదు. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొన్ని గంటలకే, మరొ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైకాపాకు చెందిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన రాజీనామాను ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వం మరియు పార్టీ పదవులకు గుడ్‌బై చెప్తూ, గ్రంధి శ్రీనివాస్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు.
గ్రంధి శ్రీనివాస్: ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఓడించిన నేత
గ్రంధి శ్రీనివాస్, ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అందుకు కారణం 2019 ఎన్నికల్లో ఆయన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గెలవడమే. అలాంటి నేత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. అటు పార్టీలోనూ యాక్టివ్‌గా లేరనే టాక్ ఉంది. దీంతో గ్రంధి శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో అయినా రాజీనామా లేఖను జగన్ కు పంపారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే.. భీమవరం నియోజకవర్గంలో పార్టీకి దిక్కెవరు అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.
గ్రంధి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి:
గ్రంధి శ్రీనివాస్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీనివాస్ అసంతృప్తితో రగిలిపోయారని చెబుతున్నారు. అందుకు కారణం మంత్రి పదవేనట. పవన్ కళ్యాణ్‌పై గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తారని గ్రంధి శ్రీనివాస్ ఆశించారు. కానీ.. రాలేదు. రెండో దఫా అయినా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అప్పుడు కూడా రాలేదు. దీంతో ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వెళ్లగక్కినట్టు తెలిసింది.
‘ఇంత డబ్బు, సమయం ఖర్చు చేసి పవన్ కళ్యాణ్‌పై గెలిచాను. నాకే మంత్రి పదవి ఇవ్వలేదు. కనీసం పార్టీలో గౌరవం లేకుండా పోయింది. నా మాట కొందరు అధికారులు వినడం లేదని చెప్పాను. వారిని కూడా మార్చలేదు. భీమవరం వైసీపీలో వేరే ప్రాంతాల వారి పెత్తనం పెరిగిపోయింది. ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో ఉండటం అవసరమా’ అని గ్రంధి శ్రీనివాస్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముందే తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది.
పార్టీలోని కీలక నేతలు గ్రంధికి సర్ధిచెప్పి 2024 ఎన్నికల్లో నిలబెట్టారు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి గ్రంధి ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇటీవల జగన్ పశ్చిమగోదావరి జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కూడా గ్రంధి శ్రీనివాస్ రాలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. అటు క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదనే టాక్ నడుస్తోంది. ఈ సమయంలో పార్టీకి రాజీనామా చేసి జగన్ కు షాక్ ఇచ్చారు.