టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali)పై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పలు కేసులు నమోదవగా, తాజాగా మోసం చేశారంటూ మరో ఫిర్యాదు అందింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన కే. సత్యనారాయణ శెట్టి అనే వ్యక్తి, టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో పోసాని పై ఫిర్యాదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పోసాని, మహేష్ అనే వ్యక్తి కలిసి రూ.9 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆయన ఆరోపించారు.
BCCI Meet IPL Captains: ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కీలక సమావేశం!
ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఎలాంటి న్యాయం జరగలేదని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతూ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ వద్ద ఫిర్యాదు చేశారు. దీనితో టీడీపీ నేతలు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు? తదుపరి చర్యలు ఏమిటన్నది ఆసక్తిగా మారింది.
పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే 17 కేసులు నమోదైనట్లు సమాచారం. గతంలో ఆయన రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక, సినీ పరిశ్రమలో కూడా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వరుసగా కోర్టుల నుండి బెయిల్ పొందుతున్నా, ప్రతి కేసు ఆయనకు కొత్త చిక్కులు తెస్తోంది. ఈ నేపథ్యంలో రూ.9 లక్షల మోసం కేసు పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.