ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం విస్తరణకు కొత్త ఊపిరి అందించేలా ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహెజా కార్ప్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.2,172 కోట్ల పెట్టుబడితో విశాఖలో వాణిజ్య, నివాస భవనాల నిర్మాణానికి ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు తమ కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన ఆధునిక సౌకర్యాల కలిగిన టవర్లు, ఆఫీస్ స్పేస్‌లు, టెక్ పార్క్‌లు నిర్మించాలని రహెజా సంస్థ ప్రతిపాదించింది. ఇందుకోసం మధురవాడలో సుమారు 27 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం.
Dhanteras 2025: ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల అస్సలు కొనకండి.. కొన్నారో అంతే సంగతులు!
ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే విశాఖ ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశముంది. రహెజా సంస్థ ప్రతిపాదన ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ద్వారా నేరుగా 9,681 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా, నిర్మాణ దశలో మరెందరో కార్మికులకు, సేవా రంగాల్లోని చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. విశాఖలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ప్రారంభమైన నేపథ్యంలో, ఈ కొత్త పెట్టుబడులు ఆ నగరాన్ని దక్షిణ భారతదేశంలో ఐటీ హబ్‌గా రూపుదిద్దుకునే దిశగా తీసుకెళ్లనున్నాయి.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ, నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి, విశాఖను “విశాఖటెక్ సిటీ”గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. రహెజా ప్రాజెక్ట్ ఆ దిశలో కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమి, అనుమతుల ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో పనులు మొదలయ్యేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చర్యలతో విశాఖపట్నం ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారి, రాష్ట్ర అభివృద్ధికి కొత్త శక్తిని అందించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.