ఎనిమిదేళ్ల పాటు భారత రొయ్యల దిగుమతులపై ఆంక్షలు విధించిన ఆస్ట్రేలియా, మంగళవారం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే తొక్క తీయని (unpeeled) రొయ్యల దిగుమతులకు అనుమతి ఇచ్చింది. 2017 జనవరిలో కొంతమంది భారత ఎగుమతిదారుల రొయ్యలలో వైట్ స్పాట్ వైరస్ గుర్తించడంతో ఆస్ట్రేలియా ఈ ఆంక్షలను విధించింది. ఈ నిర్ణయం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారింది, ఎందుకంటే దేశంలోని రొయ్యల ఉత్పత్తిలో 80% వాటా ఈ రాష్ట్రానిదే. ఇప్పటి వరకు అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడి ఉన్న ఆంధ్ర రొయ్యల రంగానికి, ఆస్ట్రేలియా తలుపులు తిరిగి తెరవడం ఒక కొత్త అవకాశంగా మారింది.
Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!
ఆస్ట్రేలియా ఈ నిర్ణయాన్ని షరతులతో ఆమోదించింది. రొయ్యలు వ్యాధి లేని ప్రాంతాల (disease-free zones) నుండి ఆర్గానిక్ విధానంలో సేకరించబడాలి, ఫ్రీజ్ చేయబడిన (frozen) రూపంలో ఉండాలి, మరియు పూర్వంలానే Deveined చేసి పంపించాలి. ఈ షరతులు 2017లోనూ అమల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేశారు. ఈ నిర్ణయానికి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దిగుమతి దారుల లాబీయింగ్ కూడా కారణమైంది. వారు తమ ప్రభుత్వాలను భారతీయ రొయ్యలపై ఉన్న ఆంక్షలను సడలించమని నిరంతరం కోరుతున్నారు. ఆస్ట్రేలియా ఈ సడలింపు నిర్ణయం తీసుకోవడం వలన, భారతీయ సముద్ర ఆహార ఎగుమతిదారులకు కొత్త మార్గం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉండగా, ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. “వైట్ స్పాట్ వైరస్ కారణంగా భారత రొయ్యలపై ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు ఎగుమతిదారులకి పెద్ద అడ్డంకిగా మారాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఆ అడ్డంకి తొలగి, మొదటి రొయ్యల దిగుమతికి అనుమతి లభించడం రొయ్యల రంగానికి ఎంతో పెద్ద అడుగు” అని తెలిపారు. ట్రంప్ పాలనలో అమెరికా 59.72% వరకు పన్నులు విధించడంతో, ఆంధ్ర రొయ్యల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరుచుకోవడం వల్ల, రాష్ట్ర రొయ్యల పరిశ్రమకు నూతన ఉత్సాహం లభించనుంది.