డా. ప్రసాదమూర్తి
Jagan Political Depression: చంద్రబాబు అరెస్టుతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు దేశమంతా హెడ్ లైన్స్ కి ఎక్కాయి. చంద్రబాబు అరెస్టు వెనక రాజకీయ కుట్ర ఉందని ఇప్పటికే అనేక వ్యాఖ్యలు, విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో 2021 నాటి స్కిల్ డెవలప్మెంట్ కేసును ఇప్పుడు తిరగతోడారు. ఆ కేసులో అప్పుడు చంద్రబాబు పేరు లేదు. ఇప్పుడు ఇరికించి ఆయన్ని బోనెక్కించారు. ఇది కేవలం రాజకీయమైన కక్షపూరిత చర్యేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకపక్క ఏసీబీ కోర్టులో వాదనలు ప్రతి వాదనలు జరుగుతున్నాయి. జడ్జి గారి తీర్పు ఎలా ఉన్నా అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ సంచలనానికి జగన్ ఎందుకు తెరవతీశాడా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉన్న పరిపక్వ నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయడంలో, వారి జిత్తులను చిత్తు చేయడంలో ఆరితేరిన రాజనీతిజ్ఞుడుగా చంద్రబాబు ప్రసిద్ధికెక్కాడు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కల తిరుగుతున్నాడు. ప్రజా సమస్యల మీద, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద, అవినీతి అరాచకత్వం నియంతృత్వం, అసమర్థ పరిపాలన మీద దండయాత్ర ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు. దీనితో ఆయనకు ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. హారతులు పట్టి ఆహ్వానిస్తున్నారు. ప్రజా సమూహాలు ప్రవాహాలుగా ఆయన సభలకు తరలివస్తున్నాయి. ఇది అధికార వైసిపి నాయకులకు, వారి అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడటం లేదు. వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది.
ఏదో రకంగా చంద్రబాబును అడ్డుకుంటే తప్ప ప్రజల దృష్టిని మరల్చే అవకాశం, అడ్డదారి మరొకటి లేదని జగన్ కి అర్థమైంది. ఇప్పటికే జగన్, అటు కేంద్రంలో బిజెపి సర్కారు తన పట్ల అనుసరిస్తున్న కొన్ని విధానాల పట్ల కొంచెం అయోమయంలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఊపందుకునే పరిస్థితిలో ఉన్నాయి. ఎటు తిరిగి ఎటు వచ్చినా రేపు కేంద్రంలో బిజెపి సర్కార్ రాకపోతే, ప్రతిపక్షాల కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వారికి చంద్రబాబు దగ్గరైతే తన పరిస్థితి ఏమిటి అన్న అయోమయంలో భయాందోళనలో జగన్ పడిపోయినట్టు అతని చర్యలు కనపడుతున్నాయి. ఈ ఆలోచనలు ఆందోళనలు భయాలు నేపథ్యంలో జగన్ ఒక పొలిటికల్ డిప్రెషన్లో కూరుకుపోయినట్టు అర్థమవుతుంది. జగన్ ఈ తాజా స్థితికి చంద్రబాబు అరెస్టునే ఉదాహరణగా చూపించవచ్చు.
Also Read: Chandrababu Arrest : కార్యకర్తలు సైలెంట్ ..జనసేనాధినేత దూకుడు
మరోవైపు అమరావతి విషయంలో అక్కడ పేదలకు ఇళ్ళు కట్టాలన్న నిర్ణయంలో ఎంత ముందుకు పోయినా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఎదురు దెబ్బలే చవిచూడాల్సి వస్తోంది. మూడు రాజధానుల మాట పదేపదే పాటలా పాడినా ఆచరణలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాజధాని లేకుండా చేశాడని ఆంధ్రులంతా జగన్ మీద కొంత వ్యతిరేక భావంతో ఉన్న మాట వాస్తవమే. ఇంకోపక్క పోలవరం గాని ప్రత్యేక హోదా విషయం గానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంగానీ అన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. అభివృద్ధి అంశంలో ఒక్క అడుగు అయినా ముందుకు పడలేదు. జనాల ఖాతాల్లో డబ్బులు వేస్తే జనాలు తన వెంట ఉంటారని నమ్మిన జగన్, చంద్రబాబు వెంట ఇలా పరుగులు తీయడం చూస్తే చివరికి ఎన్నికల సమయానికి జనాలు ఎవరి వెంట ఉంటారో అర్థం కాని పరిస్థితి, గందరగోళ పరిస్థితి ఇప్పుడు జగన్, ఆయన మిత్రవర్గాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
ఏలిన వారు కట్టగట్టుకుని ఒక రాజకీయ సంక్లిష్ట మనోవైకల్యంలోకి జారిపోయారని అర్థమవుతుంది. దానికి పరాకాష్టగానే చంద్రబాబు అరెస్టును చూపించవచ్చు. చంద్రబాబు విషయంలో జగన్ తీసుకున్న ఈ అనాలోచిత చర్య వల్ల రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచే కాదు, తెలుగుదేశం పార్టీ అభిమానులనుంచే కాదు, ఇతర ప్రజానీకం నుంచి, మేధావుల నుంచి, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి చోటా నిరసనలు ప్రదర్శనలు ఆందోళనలు మొదలయ్యాయి.
ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ నుంచి, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకుల నుంచి అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత దావానలంలా జగన్ ని చుట్టి పాడేస్తోంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో జగన్ ముందుగా ఊహించి ఉండడు. అందుకే అరెస్టు విషయంలో ముందుకే వెళ్లాడు. కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం జగన్ మెడకి ఉచ్చులా బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నా, కాలం తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.