Site icon HashtagU Telugu

YSRCP Bus Yatra: మే 26 నుంచి ఏపీ మంత్రుల బస్సు యాత్ర…సీఎం జగన్ దిశానిర్దేశం..!

Ysrcp Bus Yatra

Ysrcp Bus Yatra

ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) మే 26 నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ‘బస్సు యాత్ర’ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ముఖ్యంగా బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని తెలియజేయడానికి నాలుగు రోజుల యాత్రను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక న్యాయ సందేశాన్ని కూడా ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 30వ తేదీతో మూడేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా సామాజిక న్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణతో సహా మంత్రుల బృందం, తమ ప్రభుత్వం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మేలుకోసం ఏం చేస్తోంది అనే అంశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ యాత్రలో ముఖ్యంగా టీడీపీ హయాంలో జరిగిన సామాజిక అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, గడిచిన మూడేళ్లుగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని కింది స్థాయి వరకూ చాటి చెప్పేలా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు బస్సు యాత్ర సందర్భంగా ఏం చేయాలో సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అమ్మ ఒడి.. విద్యాకానుక, విద్యా దీవెన పథకాలను ప్రజల్లో విస్తృతంగా చర్చించుకునేలా ప్రయత్నించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మొత్తం 17 మంది మంత్రులు, నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. వైఎస్సార్‌సీపీ నేతలు విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Exit mobile version