Site icon HashtagU Telugu

Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అత్యుత్తమ రాష్ట్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

మంగళవారం ఢిల్లీలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని దేశ, విదేశాల పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సాదరంగా ఆహ్వానించారు.

‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ లక్ష్యం

ప్రధాని మోదీ రూపొందించిన ‘వికసిత్ భారత్ 2047’ విజన్‌కు అనుగుణంగా తాము ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాన్ని రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ఈ లక్ష్యమన్నారు. దీని కోసం లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రొడక్ట్ పర్‌ఫెక్షన్ వంటి కీలక లక్ష్యాలతో 10 సూత్రాలను ఆధారంగా చేసుకుని పని చేస్తున్నామన్నారు. “సంపద సృష్టికి పెట్టుబడులు రావాలి. సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలం” అని ఆయన ఉద్ఘాటించారు.

2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పని చేస్తోందని, పనిచేసే యువత భారత్‌కు అతిపెద్ద వనరు అని చెప్పారు.

పునరుత్పాదక శక్తికి కీలక కేంద్రంగా ఏపీ

పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలో 500 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం నిర్దేశిస్తే, అందులో ఏపీలోనే 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు. సోలార్, పంప్డ్ ఎనర్జీ, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టులు చేపట్టి, దేశ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీని మారుస్తామని తెలిపారు. “భారత కర్బన ఉద్గారాల రహిత ప్రయాణంలో కీలక భాగస్వామిగా ఏపీ ఉంటుంది” అని సీఎం భరోసా ఇచ్చారు.

Also Read: Small Cars: CAFE నిబంధనలు సవరణ.. చిన్న కార్లకు ఉపశమనం!

తీర ప్రాంతం- మానవ వనరుల బలం

తీర ప్రాంతం తమకు ఉన్న అతిపెద్ద బలం అని, ప్రపంచ ప్రమాణాలతో పోర్టులు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్ల నిర్మాణం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. సెమీకండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో గ్లోబల్ టెక్ పవర్ హౌస్‌గా భారత్ మారుతుందని, అందులో ఏపీ భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని, అమెరికా తర్వాత ఇదే రెండో అతిపెద్ద కేంద్రం అవుతుందని చంద్రబాబు వెల్లడించారు.

“పెట్టుబడులను ఆకర్షించడంలో మాకు ట్రాక్ రికార్డు ఉంది. ఐటీ రంగంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి అత్యుత్తమ నివాస నగరంగా మార్చాం. ప్రస్తుతం అమరావతి నగరాన్ని గ్రీన్ సిటీగా నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు” అని సీఎం పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీని సందర్శించిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ సహా పలువురు రాయబారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Exit mobile version