AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి తీపి కబురు అందించింది. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ప్రయోగాత్మకంగా అమలులో ఉన్న ఈ విధానం ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా, దానిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి (CS) డాక్టర్ కేఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండబోతున్నాయి. వారాంతాల్లో శనివారం, ఆదివారం రోజులు సెలవులు కొనసాగుతాయి. అయితే పని రోజుల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విధిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
Read Also:Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ఆయన చెబితేనే చేశామని ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్
ఈ జీవో అమలు పరిధిని కూడా ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. సచివాలయం ఉద్యోగులతో పాటు రాజధాని అమరావతి పరిధిలోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్లు (HODs), వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, బోర్డులు, అథారిటీలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అంటే రాజధాని పరిధిలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులందరికీ ఐదు రోజుల పని విధానం వర్తించనున్నది. ఇప్పటికే గత ఏడాది జూన్ నుండి ప్రయోగాత్మకంగా ఐదు రోజుల పని విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగులు దీనికి మంచి స్పందన ఇవ్వడంతో పాటు, పనితీరు కూడా ప్రభావితం కాకుండా కొనసాగిందని ప్రభుత్వం భావించింది. ఉద్యోగుల పని సామర్థ్యం, కార్యాలయ నిర్వహణపై ఈ విధానం ఎలాంటి రుసుము లేకుండా కొనసాగిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగించడం ద్వారా ప్రభుత్వం సానుకూల నెపథ్యాన్ని నిరూపించుకుంది. ఇది ఉద్యోగులకు వర్క్–లైఫ్ బ్యాలెన్స్ సాధించడంలో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ విధానం ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంపొందించడంలో తోడ్పడే అవకాశముంది. వారాంతాల్లో రెండు రోజుల విరామం లభించటం వలన వారు కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం పొందుతూ మానసిక ప్రశాంతతను పొందుతారు. దీని ద్వారా ఆఫీస్‌లో వారు మరింత శక్తివంతంగా పనిని కొనసాగించగలరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల శ్రేయస్సు, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే దిశగా ముందడుగుగా భావించవచ్చు. ఇప్పటికే అమలులో ఉన్న విధానానికి వచ్చే సంవత్సరం జూన్ వరకు పొడిగింపు ఇచ్చిన ఈ జీవో, ఉద్యోగులకు మరొకసారి ఆనందం పంచుతోంది.
Read Also: Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్ గాంధీ