Site icon HashtagU Telugu

YS Sharmila : వైఎస్ భారతికి అండగా వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్

Andhra Pradesh Congress Chief Ys Sharmila Ys Bharati Ysrcp Ys Jagan Ap Politics

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన వదిన వైఎస్ భారతికి నైతిక మద్దతు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని షర్మిల తీవ్రంగా ఖండించారు.  చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్‌పైనా ఆమె ఫైర్ అయ్యారు. భారతీ రెడ్డిపై(YS Sharmila) సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానమని షర్మిల అభిప్రాయపడ్డారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే సైకో గాళ్లను నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదన్నారు. తప్పుడు కూతలు కూసిన వెధవపై, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని షర్మిల పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నానని ఆమె చెప్పారు.

Also Read :Indian Robots : మయన్మార్‌‌లో భారత రోబోలు.. ఏం చేస్తున్నాయి ?

పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్షను ఎదుర్కోక తప్పదు

‘‘మహిళలపై నోరుపారేసుకునే వెధవలను ఈ సమాజం సహించదు.  పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్షను ఎదుర్కోక తప్పదు. ఇతరుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది నీచపు పద్ధతి. ఇలాంటి పద్ధతి ఏపీలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ,టీడీపీలే’’ అని షర్మిల ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఆ రెండు పార్టీలే ఆదర్శమని వ్యాఖ్యానించారు. ‘‘అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. చివరకు రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయారు’’ అని ఆమె విమర్శించారు.

మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు.. 

‘‘కొంతమంది రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డుపైకి లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలను అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని నిర్మూలించడానికి అన్ని పార్టీలు ఏకం కావాలి’’ అని షర్మిల పిలుపునిచ్చారు. ‘‘భారతీ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు విని చాలా బాధ కలిగింది. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం’’ అని ఆమె చెప్పారు. ఏపీ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ షర్మిల ఈ ట్వీట్ చేశారు. 

Also Read :Tahawwur Ranas Lawyer: ఉగ్రవాది తహవ్వుర్ రాణా తరఫు న్యాయవాది ఎవరు?