ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు జరిగే ఈ పర్యటనలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ముఖ్యమంత్రి పీ4-జీరో పావర్టీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సంబంధించి సీఎం షెడ్యూల్ కూడా ఖరారైంది. 2026 జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌లో పర్యటిస్తారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటుగా ముఖ్యమంత్రి సెక్రటరీ కార్తీకేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఐటీశాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సల్‌లు కూడా దావోస్ వెళుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దావోస్ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీమ్ పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధుల్ని కలవనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి.. పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. పలువురు ప్రముఖలతో ఆయన సమావేశమయ్యారు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.. ఇప్పుడు అక్కడ కుదుర్చుకున్న ఎంవోయూలను అమలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా, ఆయా జిల్లాల వారీగా భూముల కేటాయింపుతో పాటుగా ఇతర అనుమతులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు, పరిశ్రమలు శంకుస్థాపనకు కూడా సిద్ధమవుతున్నాయి.
మరోవైపు పీ4-జీరో పావర్టీపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. పీ4 అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో సమీక్ష చేశారు. పీ4 సర్వేలో వైద్యసాయం, ఉద్యోగం, చిరు వ్యాపారాల విస్తరణ, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, నైపుణ్యాల పెంపుపై సాయం కోరిన బంగారు కుటుంబాలు వంటి అంశాలపై చర్చించారు.
