AP Cabinet : ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. పెట్టుబడులు, రాజధాని అభివృద్ధిపై దృష్టి

ఈ సమావేశంలో మొత్తం 31 అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం ప్రత్యేకంగా చర్చించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 31 అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం ప్రత్యేకంగా చర్చించనున్నారు.

క్యాబినెట్ సమావేశంలో పెట్టుబడులు, అభివృద్ధి, పరిపాలనా వ్యవస్థ విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (IIPC) తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని కేవలం ఎకరా రూ.99 పైసల ధరకు కేటాయించనున్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1582.98 కోట్ల పెట్టుబడితో 8000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో భాగంగా 49వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే జీఏడీ టవర్‌ (రూ.882.47 కోట్లు), హెచ్‌ఓడి కార్యాలయాలు (రూ.1487.11 కోట్లు), ఇతర పరిపాలనా భవనాలు (రూ.1303.85 కోట్లు) నిర్మించేందుకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు మంజూరుకాబోతున్నాయి.

ఇతర సంస్థలకు భూ కేటాయింపులకు, పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల అప్‌గ్రేడ్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అంతేకాక, ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్‌కు గతంలో చౌక ధరకు భూమి కేటాయించడంపై పునఃసమీక్ష జరిపి, చదరపు మీటర్‌కి రూ.1 చొప్పున భూమిని కేటాయించే ప్రతిపాదనపై చర్చించనున్నారు.

సామాజిక సంక్షేమం పరంగా మరో 7 అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న నిర్ణయం కూడా సమావేశంలో తీసుకోనున్నారు. భవన నిర్మాణ చట్టంలో కొన్ని నిబంధనల సవరణలు, కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించిన 51 పనులకు పరిపాలనా అనుమతుల మంజూరు, మైనేని సాకేత్‌కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇంకా, రాష్ట్రంలోని కడప, విజయనగరం, సత్యసాయి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో హైడ్రో , సంప్రదాయేతర ఇంధన ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. శ్రీశైలం, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

Chengalpattu Express: చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

  Last Updated: 24 Jun 2025, 12:53 PM IST