Site icon HashtagU Telugu

Anakapalle : అధికార పార్టీకి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి కరువు

Anakapalle Ycp Mp Candidate

Anakapalle Ycp Mp Candidate

డా. ప్రసాదమూర్తి

అధికార పార్టీ (YCP)కి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్… ఇప్పుడు అభ్యర్థులను విడతవారీగా ప్రకటిస్తుండడంతో… టికెట్ ఆశించి, భంగపడ్డ నేతలు సహా అసంతృప్తులు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. మరోవైపు కొన్ని స్థానాల్లో అధికార పార్టీకి అభ్యర్థులు దొరకక, దిక్కులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అందులో ప్రధానంగా చెప్పుకుంటే, అనకాపల్లి (Anakapalle) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవరూ కూడా ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎంపీ భీశెట్టి వెంకట సత్వవతికి, తిరిగి మరొకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ లేరన్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. కొత్త క్యాండిడేట్ ను అక్కడి నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నేపధ్యంలో.. ఇద్దరు, ముగ్గురు నేతలను అనకాపల్లి లోక్ సభ బరిలో దింపేందుకు జగన్ సంప్రదించగా.. వారు అక్కడ పోటీ చేసేందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో… ప్రస్తుత అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ను అనకాపల్లి పార్లమెంట్ నుంచి రంగంలోకి దింపాలని జగన్ సంప్రదించినా.. ఆయన కూడా విముఖత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమర్ నాథ్ కు సిట్టింగ్ స్థానం నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం ఒక కారణం అయితే.. ప్రస్తుతం టీడీపీ-జనసేన కూటమి తరుపున అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరా దిలీప్ చక్రవర్తి మరో కారణంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. బైరా దిలీప్ అక్కడ చాలా గట్టిగా ఏడాదిన్నరగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ వర్గాల ప్రజలతో మమేకమై, వారికి చేదోడువాదోడుగా నిలుస్తూ.. వారిలో మంచి పట్టు సాధించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆ ప్రాంతంలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ ఉండడం, తన తల్లిగారి ప్రాంతం కావడం, చిన్నతనం అంతా… ఆ ప్రాంతంలోనే పెరగడం అనేది బైరా దిలీప్ కు కలిసివచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తన బైరా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ… ప్రజలకు సేవ చేస్తున్న బైరా దిలీప్, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా, ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేసే భాగ్యం దొరుకుతుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని, తన ఐడియాలజీని ఆ ప్రాంత ప్రజలకు వివరించడంలో బైరా దిలీప్ సక్సెస్ అయ్యారు. విజన్ అనకాపల్లి, జ్యూవెలరీ పార్క్, ఐటీ హబ్, డిజిటల్ ఫిల్మ్ స్టూడియో సహా తాను అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయేది, ప్రజలకు వివరిస్తూ.. వారిని ఆకట్టుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. బైరా దిలీప్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ, కేవలం కాపులే కాకుండా యాదవులు, మత్స్యకారులు, గవరలు, కొప్పుల వెలమలు ఇలా అందరూ… ఆయనకు మద్దతు పలుకుతున్నారు.

కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అన్న బేదభావం లేకుండా.. అందరినీ కలుపుకుపోతూ… వారికి తన విజన్ ద్వారా ఏం చేయబోయేది చెబుతున్నారు బైరా దిలీప్. దాదాపు ఏడాదిన్నరగా ఆయన అక్కడ అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటికే సుమారు 400 గ్రామాల్లో పర్యటించి, స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రత్యక్షంగా 90వేల పైచిలుకు ప్రజలను కలుసుకున్నారంటేనే.. క్షేత్రస్థాయిలో ఎలా పర్యటిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. ఈ రకంగా టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ బలంగా ప్రజల్లో దూసుకెళ్తుండడం కూడా… అధికార పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితిని తీసుకొచ్చింది. మరి అనకాపల్లి లోక్ సభ అభ్యర్థి విషయంలో అధికార పార్టీకి ఎలాంటి అభ్యర్థి దొరుకుతారో అన్నది వేచి చూడాలి.

Read Also : CM Revanth: మెగా సత్కారం, పద్మవిభూషణుడు చిరును సన్మానించనున్న సీఎం రేవంత్