By: డా. ప్రసాదమూర్తి
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), లోకేష్.. బాలయ్యలతో కలిసి గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి వచ్చిన తర్వాత ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాజకీయ వర్గాలకు అందించాయి. తెలుగుదేశం పార్టీతో ఇక పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఇప్పటివరకు అస్పష్టంగా ఉన్న విషయాన్ని, చాలా స్పష్టంగా తిరుగులేని విధంగా, ఎలాంటి సందేహాలకు, తట పటాయింపులకు తావులేని విధంగా తేల్చి చెప్పేశాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి.
పవన్ కళ్యాణ్ అనేకసార్లు టిడిపితో కలిసి ఎన్నికల బరిలో దిగుతామని, ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వమని చెప్పారు కానీ, తెలుగుదేశం పార్టీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా ముందుకు వెళుతుంది అని ఆయన ఎప్పుడూ ఇంతే స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. ప్రత్యర్థి అధికార పార్టీ వైసీపీని ఎదుర్కోవడానికి అన్ని శక్తులూ కలవాలన్నది పవన్ వ్యూహం సరైనదే కానీ అన్ని శక్తులూ కలవడానికి ఆటంకాలు చాలా ఉన్నాయి. బిజెపితో ఆయన అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు. అయితే బిజెపి తెలుగుదేశంతో కొనసాగించే బంధం మాత్రం దోబూచులాట లాంటిది. అధికార జగన్ వర్గంతో పాటు బలమైన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుతో కూడా ఏకకాలంలో సమదూరాన్ని, సమ సమీపాన్ని పాటిస్తూ, బిజెపి రాజకీయాలు కొనసాగిస్తోంది.
చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపు చూడకుండా బిజెపి, జనసేన మాత్రమే పొత్తు పెట్టుకుని ఎన్నికలలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు కూడా చేసింది. పవన్ బిజెపి వారిని కోరిన రూట్ మ్యాప్ అది కాదు. అలా చేస్తే ముక్కోణపు పోటీ అవుతుంది. అది అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే వ్యూహమే అవుతుంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపు వెళ్లకుండా కట్టడి చేయడానికి బిజెపి ఏం ప్రయత్నం చేసినా అది పరోక్షంగా జగన్ కి లాభపరడానికే అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడిక బిజెపి ఎటువైపు ఉండాలా అని తేల్చుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ కాదు. తెలుగుదేశంతో కలిసే తమ పోటీ ఉంటుందని పవన్ కళ్యాణ్ ఏ అనుమానాలకూ తావులేని విధంగా తేల్చి చెప్పేశాడు. ఈ విషయంలో బిజెపి వైఖరి ఎలా ఉంటుంది, వారి భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఇటు పవన్, బాబు కూటమివైపు బిజెపి ఉంటుందా, లేక జగన్ వైపు ఉంటుందా, లేక తటస్థంగా ఉండి ఇద్దరికీ సమ దూరాన్ని సమ బంధాన్ని కొనసాగిస్తుందా.. అది బిజెపి తెలుసుకోవాల్సిన విషయం.
Also Read: TTDs Key Decision : భక్తుల భద్రత కోసం టీటీడీ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన జరుగుతున్న పరిణామాలు చూస్తే పవన్ కళ్యాణ్ కి ఒక సువర్ణ అవకాశం చేతికి చిక్కిందని అనుకోవాలి. చంద్రబాబు జైల్లోనే సుదీర్ఘ కాలం కొనసాగాల్సి వస్తే పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలని తెలుగుదేశం పార్టీ సతమతమవుతున్న తరుణంలో పవన్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడు గాని, ఒక కూటమిగా జనసేన, తెలుగుదేశం ఎన్నికల్లో విజయం దిశగా పయనించడానికి ముందుండి యుద్ధాన్ని సమర్థంగా నడిపే యోధానుయోధుడిగా నిరూపించుకునే అవకాశం వచ్చింది. అలాగే జరిగితే ఎన్నికల పొత్తులో పవన్ కళ్యాణ్ కి అనివార్యంగా తాను ఆశిస్తున్న సీట్లు లభించే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రజల ముందు ఒక బలమైన ప్రతిపక్ష సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సుడిగాలిలా దూసుకు వచ్చే అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అమలులో ఉన్న రాజకీయ వర్గాల కోడి లెక్కలు తారుమారు చేసి మరిన్ని సీట్లు అధికంగా గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఎన్నికల్లో చంద్రబాబుకి సీఎం అయ్యే అవకాశాలు పూర్తిగా అడుగంటిపోయినప్పుడు, జగన్ కి పోటీగా పవన్ ముందు నిలబడే అవకాశం ఉంది.
కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే సీఎం పీఠాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా అత్యంత కష్టంగానే అయినా పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం అప్పగించాల్సి రావచ్చు. అప్పుడు ఆ పనికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేకపోతే, చక్రం తిప్పటానికి బిజెపి అతని వెనక ఎలాగూ ఉండనే ఉంది. ఒకవేళ ఈ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం సమకూరకపోతే అది కూడా పవన్ కళ్యాణ్ కి ఒక వరం లాంటిదే. చంద్రబాబు లేని తెలుగుదేశం పార్టీ గందరగోళ పరిస్థితుల్లో రెండు పార్టీలకి ఏకైక దిక్కుగా ముందుకు కదిలిన అనుభవంతో ఆంధ్ర ప్రదేశ్ లో తనకు దక్కిన ప్రతిపక్ష స్పేస్ పవన్ కళ్యాణ్ కు వరంగా మారవచ్చు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలకు సీఎం అభ్యర్థిగా సింగిల్ ఛాయిస్ గా నిలిచే అవకాశం ఉంది.
ఇలా ఆంద్రప్రదేశ్ లో శర వేగంతో మారుతున్న రాజకీయ పరిణామాలు పవన్ కళ్యాణ్ కి వరంగా మారనున్నాయని ఊహించవచ్చు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగినా చెప్పలేం. ఒకవేళ చంద్రబాబు బెయిల్ తో బయటకు వచ్చినా, పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న పొత్తు నిర్ణయం ఏపీలో ప్రతిపక్ష రాజకీయాల్లో పవన్ కి ఒక అఖండమైన స్థానాన్ని సమకూర్చి పెడుతుందనే చెప్పాలి. ఒక నాయకుడు జైలుకు వెళ్తే అంత మాత్రాన ప్రతిపక్షం బలహీనం కాదని నిరూపించడమే కాకుండా, కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి రాజకీయ పరిణతి కనబరిచిన పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క నిర్ణయంతో బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.