Site icon HashtagU Telugu

Build Amaravati: అమరావతి నిర్మాణం ఇక రయ్ రయ్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు….

Build Amaravati

Build Amaravati

Build Amaravati: ఏపీ, ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి, పోలవరం నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరాల స్థాయిలో నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ దిశగా కొన్ని కీలక అడుగులు వేస్తోంది. అధికారంలోకి రాగానే, అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ పనులను ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు, మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

అమరావతి నిర్మాణంలో భాగంగా 20 రకాల పనులకు ఆమోదం:

అమరావతి నిర్మాణం ప్రారంభానికి సంబంధించి ఇటీవల సీఆర్‌డీఏ సమావేశం నిర్వహించటం జరిగింది, ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20 రకాల పనులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ. 11,467 కోట్లతో ఈ 20 పనులు ప్రారంభించనున్నారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ రూ. 15,000 కోట్ల రుణం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఈ రుణ నిధులతోనే ఈ ప్రాథమిక పనులను చేపట్టనున్నారు.

వివిధ మౌలిక సదుపాయాల కోసం నిధుల మంజూరు:

అమరావతిలో గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఆఫీసర్ల అపార్టుమెంట్లు, ఐఏఎస్ అధికారుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాస సముదాయాలు, ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణం ఈ నిధులతో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, మంత్రుల క్వార్టర్స్‌ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని ఆమోదం తెలిపింది.

సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ భవనం, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం కూడా ఈ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో వరదనీటి నిర్వహణ కోసం కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించినట్లు తెలిపింది. దీనికి సీఆర్డీఏ రూ. 1585 కోట్లు వెచ్చించనుంది. అలాగే, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కోసం రూ. 984 కోట్లు ఖర్చు చేయాలని ఆమోదించారు.

ఇందులో భాగంగా, అమరావతి రాజధాని పరిధిలో కాలువలు, డ్రెయిన్లు, సైక్లింగ్ ట్రాకులు, వాకింగ్ ట్రాకులు, నీటి సరఫరా నెట్‌వర్క్‌, సీవరేజీ, మరియు యుటిలిటీ డక్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం కూడా ఆమోదం తెలిపింది.

Also Read : Delhi Politics On Fire: ఢిల్లీ పాలిటిక్స్ లో పుష్ప వార్? తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్… రప్పా రప్పా అంటూ బీజేపీ!

Exit mobile version