CBN Media: చంద్ర‌బాబు సానుభూతి మీడియాకు స‌రైనోడు..!

రెండేళ్ల క్రితం వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యంలేని ఏపీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావును తెలుగు రాష్ట్రాల్లోని ఒక విభాగం మీడియా హీరోను చేసింది. ఇప్పుడు అదే మీడియా మీద ఆయ‌న రివ‌ర్స్ కావడం విశేషం.

  • Written By:
  • Updated On - November 14, 2022 / 02:07 PM IST

రెండేళ్ల క్రితం వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యంలేని ఏపీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావును తెలుగు రాష్ట్రాల్లోని ఒక విభాగం మీడియా హీరోను చేసింది. ఇప్పుడు అదే మీడియా మీద ఆయ‌న రివ‌ర్స్ కావడం విశేషం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రాకుండా చంద్ర‌బాబు అనుకూల మీడియానే అనాలోచితంగా న్యూస్ ను ఇస్తుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. పైగా టీడీపీ సొంత మీడియాగా పేరొందిన‌ వేదిక‌పైన‌ శ్రీనివాస‌రావు ఆ వ్యాఖ్య‌లు చేయ‌డం మామూలు అంశం కాదు. అంతేకాదు, ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టార‌ని టీడీపీ లోని కొంద‌రు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అభిమానాన్ని దుర‌భిమానంగా మార్చుకుని సొంత ల‌బ్ది కోసం 2004 నుంచి 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు ఆ మీడియా చంద్ర‌బాబును ద‌గ్గ‌రుండి ఓడించింద‌ని టీడీపీ లోని కొంద‌రు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో మాట్లాడుకుంటారు. కేంద్రం, రాష్ట్రంలో తిరుగులేని లీడ‌ర్ గా చంద్ర‌బాబు 2004 వ‌ర‌కు ఉన్నారు. ఆ స‌మ‌యంలో అలిపిరి వ‌ద్ద మావోస్టులు బాంబ్ దాడి చేశారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ చంద్ర‌బాబు ముందుస్తుకు వెళితే, సానుభూతితో గెలుస్తార‌ని ఇదే మీడియా చెప్పింది. అదే విధంగా 2009 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీతో క‌లిసి వెళితే గెలుపు ఖాయ‌మ‌ని చంద్ర‌బాబును రాంగ్ రూట్ ప‌ట్టించింది.

Also Read:  Minister Roja: రోజా మంత్రి పదవికి ఎసరు..?

2014 ఎన్నిక‌ల్లోనూ ఒంట‌రిగా వెళ్లాల‌ని రిపోర్టులు ఇచ్చిన‌ప్ప‌టికీ టీడీపీలోని సీనియ‌ర్లు కొంద‌రు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగ‌లిగారు. లేదంటే, 2014 ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబుకు డ్యామేజ్ జ‌రిగేది. ఇక 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గ‌కుండా మొండిగోడ‌ల‌తో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌ల‌హా ఇచ్చింది కూడా ఇదే మీడియా అంటూ టీడీపీ సీనియ‌ర్లు చెప్పుకుంటారు. ప్ర‌ధాని మోడీతో యుద్ధం చేయాల‌ని చంద్ర‌బాబుకు సూచ‌న ఇవ్వ‌డంతో పాటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అనుకూల రిపోర్ట్ ఇవ్వ‌డం ద్వారా టీడీపీని కోలుకోలేని ప‌రిస్థితికి దుర‌భిమానాన్ని చాటే ఈ మీడియా తీసుకెళ్లింద‌ని టీడీపీ లోని కొంద‌రి అభిప్రాయం. 2024 ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబును అధికారంలోకి రాకుండా ఇదే మీడియా చేస్తుంద‌ని కొలికిపూడి శ్రీనివాస‌రావు చేస్తోన్న హాట్ కామెంట్‌. ఎందుకంటే, ఏమీ లేకుండానే జ‌న‌సేనాని ప‌వ‌న్ ను ఫోక‌స్ చేయ‌డం ద్వారా న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అంచ‌నా.

ఇటీవ‌ల విజ‌య‌వాడ నోవాటెల్ హోట‌ల్ లో ఉన్న ప‌వ‌న్ ను చంద్ర‌బాబు క‌లిశారు. విశాఖ కేంద్రంగా ప‌వ‌న్ కు జ‌రిగిన అవ‌మానికి చింతిస్తూ ఉమ్మ‌డి పోరాటం చేద్దామంటూ పిలుపు నిచ్చారు. అంత‌కు ముందు ఒన్ సైడ్ ల‌వ్ అంటూ జ‌న‌సేన పార్టీతో పొత్తుకు సానుకూల న్యూస్ ను ప్ర‌చారం చేశారు. జ‌న‌సేన బ‌లోపేతం అయ్యేలా చంద్ర‌బాబు సానుభూతి మీడియా ఫోక‌స్ చేసింద‌ని శ్రీనివాస‌రావు చెబుతున్నారు. అంతేకాదు, ప‌వ‌న్ వ‌ద్ద‌కు చంద్ర‌బాబు వెళితే, మోడీ ప‌వ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చారంటూ గుర్తింపులేని జ‌న‌సేన పార్టీని అడ్డ‌గోలుగా ఫోక‌స్ చేయ‌డం ద్వారా చంద్ర‌బాబుకు భారీ న‌ష్టం చేస్తున్నార‌ని కొలికిపూడి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ఆయ‌న చేసిన సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌ల వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read:  KCR Politics: తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు ప‌ట్టాభిషేకం?

ఇంత‌కూ ఎవ‌రీ కొలికిపూడి శ్రీనివాస‌రావు అంటూ గుగూల్ లో అన్వేషించిన‌ప్ప‌టికీ పూర్తి వివ‌రాలు రాలేదు. కానీ, బీజేపీ లీడ‌ర్ విష్ణువ‌ర్థ‌న్ రెడ్డిని ఒక ప్రైవేటు డిబేట్ లో చెప్పుతో కొట్టిన సంఘ‌ట‌న ఆయ‌న్ను పాపుల‌ర్ చేపింది. ఏడాదిన్నర‌ నుంచి ప్ర‌తిరోజూ అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి, ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి నాయ‌కుడు అంటూ చంద్ర‌బాబు సానుభూతి మీడియా ఫోక‌స్ చేసింది. మ‌హా పాద‌యాత్ర ను లీడ్ చేసే లీడ‌ర్ గా ఆకాశానికి ఎత్తింది. ఆయ‌న‌ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను మూసేసి ఉద్య‌మంలో పాల్గొన్నార‌ని చెబుతుంటారు. ఏపీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు, అమరావతి ఐక్యకార్యాచరణ సమితి లీడ‌ర్ గా ఉన్నార‌ని చంద్ర‌బాబు సానుభూతి మీడియా ప్ర‌తిరోజూ రెండేళ్లు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తోంది.

సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజ‌కీయం గురించి కొలికిపూడి ప్ర‌శంసించారు. ఆయ‌న నిత్యం రాజ‌కీయాల‌ను ఏ విధంగా చేయాలో ఆలోచిస్తుంటార‌ని కొనియాడారు. పైగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను ఇవ్వ‌డం ద్వారా స‌మాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియ‌చేశార‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైన సామాజిక‌వ‌ర్గాల‌ను గుర్తించిందా? అంటూ చంద్ర‌బాబు సానుకూల మీడియాను వేదిక‌గా చేసుకుని కొలికిపూడి చాక‌చ‌క్యంగా టీడీపీని కార్న‌ర్ చేయ‌డాన్ని ఆ ప్రోగ్రామ్ ల‌ను నిర్వ‌హించే అప‌ర‌మేధావులు గ్ర‌హించ‌లేక‌పోవ‌డం కొస‌మెరుపు.

Also Read:  TTDP: టీడీపీ వైపు 1983 బ్యాచ్‌, బీసీల‌కు కాసాని గాలం!