Site icon HashtagU Telugu

Gummadi Sandhya Rani : 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తాం..

Gummadi Sandhya Rani

Gummadi Sandhya Rani

Gummadi Sandhya Rani : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డెక్కారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన పాడేరు ప్రాంతంలో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాహనాలను ఆపేస్తూ, రహదారులను నిర్బంధిస్తూ ఆదివాసీ సంఘాలు, నేతలు బంద్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

ఈ బంద్‌ కారణంగా పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. అంతేకాకుండా, విద్యా రంగంపైనా ప్రభావం పడింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. 1/70 చట్టాన్ని పరిరక్షించాలి అన్న ప్రధాన డిమాండ్‌తో ఆదివాసీ సంఘాలు ఈ నిరసన చేపట్టాయి.

Vidadala Rajini : ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టకు విడదల రజిని

ఏపీలో 1/70 చట్టంపై పెరుగుతున్న అసహనం
ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఈ నిరసనకు ప్రధాన కారణంగా మారాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్‌గా మారుస్తే పెట్టుబడులకు అవకాశం కల్పించవచ్చని ఆయన చేసిన సూచనలు ఆదివాసీ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి.

1/70 చట్టం పరిరక్షణ కోల్పోతుందనే భయంతో ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు రోడ్డెక్కాయి. ఫ్రీ జోన్ విధానం అమల్లోకి వస్తే ఆదివాసీ భూములపై ప్రైవేట్ పెట్టుబడిదారుల నియంత్రణ పెరిగిపోతుందని, ఇది ఆదివాసీల హక్కులను కూలదోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిరసనకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మద్దతు ప్రకటించింది. వైసీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గిరిజనుల హక్కుల్ని కాపాడాలని, 1/70 చట్టాన్ని చెక్కుచెదరనివ్వకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ స్పష్టత – 1/70 చట్టాన్ని మార్చే ఆలోచన లేదన్న గుమ్మడి సంధ్యారాణి
ఈ నిరసనల నేపథ్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి , జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ప్రభుత్వానికి 1/70 చట్టాన్ని సవరించే ఎలాంటి ఆలోచన లేదని, ఆదివాసీ హక్కులను కాపాడటమే తమ విధానమని స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. “1/70 చట్టాన్ని ప్రభుత్వ విధిగా పరిరక్షిస్తుంది. గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉంటాం” అని హామీ ఇచ్చారు.

అలాగే, వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. “వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. “గత ఐదు సంవత్సరాల వైఎస్ జగన్ పాలనలో గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు అటవీ ప్రాంతాలను అడ్డాగా మార్చారు. గిరిజనుల ఉపాధిని నాశనం చేశారు” అంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు.

ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడం అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. “గతంలో వైసీపీ హయాంలో గంజాయి సాగును పెంచి, గిరిజనులను దారుణంగా మోసం చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆదివాసీల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది” అని అన్నారు.

Devotional: దేవుడు మనతో ఉన్నాడని ఎలా తెలుస్తుంది.. సంకేతాలు ఏమైనా కనిపిస్తాయా?

Exit mobile version