పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Session) శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అలాగే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి అర్పించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రధానంగా పేదరిక నిర్మూలన, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పేదరిక నిర్మూలనలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తూ, 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకువచ్చినట్టు తెలిపారు. అలాగే, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు మూడు కోట్ల ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
Deputy CM Bhatti: మహిళలే టార్గెట్.. డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు!
విద్యా రంగంలో అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని, నూతన విద్యా విధానం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి తెలిపారు. అమృత్ భారత్, నమో భారత్ రైళ్ల ద్వారా రవాణా వ్యవస్థను ఆధునీకరించడం, భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దడం, కృత్రిమ మేధ (AI) రంగంలో భారత ఏఐ మిషన్‌ను ప్రారంభించడం వంటి అంశాలను ఆమె వివరించారు. మహిళల సాధికారతను పెంపొందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేస్తోంది. లక్ష్యం – 3 కోట్ల మంది మహిళలను లక్‌పతీ దీదీగా మార్చడం. అలాగే, పార్లమెంట్ సమావేశాల్లో మహిళల రిజర్వేషన్ బిల్లుపై చర్చకు అవకాశం ఉందని అంచనా వేశారు.
అలాగే ఏపీ అంశానికి వస్తూ.. రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం (Polavaram) ప్రాజెక్టును ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఇటీవలే రూ.12 వేల కోట్లను విడుదల చేసిన అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేదాకా రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఈ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు రెండు విడతలుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.