CM Chandrababu : సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకువెళ్తున్నామన్నారు. ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులని చంద్రబాబు అన్నారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారు.
Read Also: T-MAAS Card: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక మెట్రో, ఆర్టీసీ ప్రయాణం సులభతరం…
మిగుల్చుకోవాలంటే నెలకు రూ.76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నాం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నాం. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు ఇస్తున్నాం. కోటిన్నర కుటుంబాలకు గానూ 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చవుతోంది. ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
గత పాలకులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దివాళా తీయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.11వేలకోట్లు కేంద్రం ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ కూడా గాడిన పడింది. విశాఖకు రైల్వే జోన్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల చేపట్టాం. మిగిలిన చోట కూడా పూర్తిచేస్తాం. ఈనెలలో మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించి జూన్‌లోపు ఉద్యోగాలు ఇస్తాం అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చాక చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రాజధాని అమరావతిని గాడిలో పెట్టాం. అక్కడ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రాజధాని అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది. దాని ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. మూడు నాలుగేళ్లలో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రానికి పోలవరం జీవనాడి. 2027 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తిచేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?