CBN Gratitude Concert : చంద్రబాబు ఘనతకు చరిత్రే సాక్ష్యం.. ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’ నేడే !

CBN Gratitude Concert : హైటెక్ సిటీ.. హైదరాబాద్ సిగలో కలికితురాయి. 1998లో హైటెక్ సిటీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు అంకురార్పణ చేశారు.

  • Written By:
  • Updated On - October 29, 2023 / 07:55 AM IST

CBN Gratitude Concert : హైటెక్ సిటీ.. హైదరాబాద్ సిగలో కలికితురాయి. 1998లో హైటెక్ సిటీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు అంకురార్పణ చేశారు. ఇప్పుడిది హైదరాబాద్ మహానగరంలో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. హైటెక్ సిటీని నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ (అక్టోబరు 29) ఐటీ ఉద్యోగులు ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’  పేరుతో హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. 25 ఏళ్ల క్రితమే ‘విజన్-2020’ నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన చంద్రబాబు దార్శనికతపై ఈ వేడుకల్లో చర్చించనున్నారు. హైటెక్ సిటీ సృష్టికర్త చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’  జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్ష మంది వరకు తరలి వస్తారని అంచనా. దేశ, విదేశాల నుంచి భారీగా చంద్రబాబు అభిమానులు హాజరుకానున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈ ప్రోగ్రాం కోసం స్టేడియం చుట్టూ భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. తెలుగు ఐటీ నిపుణుల టీమ్ ఈ ప్రోగ్రాం ఏర్పాట్లను పరిశీలిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై నిర‌స‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా వివిధ వ‌ర్గాల వారు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు వివిధ రూపాల్లో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. చంద్ర‌బాబు అరెస్ట్ అయిన మ‌రుస‌టి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌లు మొదలుపెట్టారు. హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చిన ఐటీ కంపెనీలు, బిల్డింగ్స్ వ‌ద్ద ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు సపోర్ట్‌గా నిరసన కార్యక్రమాలు నిర్వ‌హించారు. బ్లాక్ డ్రెస్‌ల‌తో ఆఫీసుల‌కు వెళ్లి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇటు మెట్రో రైలులో కూడా చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా బ్లాక్ డ్రెస్‌ల‌తో ఐటీ ఉద్యోగులు నిర‌స‌న తెలిపారు. ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహించనున్న ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’  కార్యక్రమం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Also Read: TDP Telangana : తెలంగాణలో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం.. ఇదే!

చంద్రబాబు ఘనతకు చరిత్రే సాక్ష్యం.. 

  • సుమారు 25 ఏళ్ల క్రితం మన దేశంలోఐటీ పేరెత్తితే బెంగళూరు నగరమే గుర్తుకొచ్చేది. ఆ సమయానికి  హైదరాబాద్ పేరు దాని దరిదాపుల్లో కూడా లేదు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు.
  • 1997 మార్చిలో సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చారు.చంద్రబాబు నాయుడు.. బిల్‌గేట్స్ అపాయింట్మెంట్ తీసుకొని తన విజన్ గురించి ఆయనకు వివరించారు. ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి విజన్, ఐటీ, సాంకేతిక రంగాల మీద శ్రద్ధ, అవగాహన ఉండటం చూసి బిల్ గేట్స్  ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయం ఏర్పాటుకు బిల్ గేట్స్ అంగీకారం తెలిపారు. అప్పటికి అమెరికాలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం తప్ప ప్రపంచంలో మరెక్కడా దాని ఆఫీసు లేదు.
  • అదే సంవత్సరం (1997) ‘విజన్ 2020’ డాక్యుమెంట్ తయారీకి 14 టాస్క్ ఫోర్స్ లను చంద్రబాబు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారులో హైటెక్ సిటీని కట్టేందుకు రెడీ అయ్యారు.
  • ‘హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ’.. దీన్నే మనం ఇప్పుడు  షార్ట్ కట్ లో ‘హైటెక్ సిటీ’ అని పిలుస్తున్నాం.
  • హైటెక్ పేరుతో ఒక బిల్డింగ్ కట్టేస్తే.. అందులో వచ్చే నాలుగు కంపెనీలతో రాష్ట్రానికి ఒరిగేదేంటి అని ప్రతిపక్షాలు ఆనాడు ఎగతాళి చేశాయి. దేనికైనా చేతల్లోనే సమాధానం చెప్పే అలవాటున్న చంద్రబాబు.. హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ పేరిట ఒక నిర్మాణం చేసి 1998 నవంబర్ 22న నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఆ తర్వాత హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయింది.
  • మాట ఇచ్చినట్టుగానే 1999 ఫిబ్రవరి 28న హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను బిల్ గేట్స్ ప్రారంభించారు.  ఆ తర్వాత ఇన్ఫోటెక్, ఐ‌బీఎం, జీఈ, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, డెల్, ఒరాకిల్ వంటి ఎన్నో ఐటీ సంస్థలు హైటెక్ సిటీ చుట్టూరా వెలిశాయి. తెలుగునాట సామాజిక, ఆర్థిక పురోగతికి బీజం వేసిన హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ నగరానికి ఒక ఐకాన్ గా మారిపోయింది.