Nagababu : 100 రోజుల తర్వాతే.. నాగబాబుకు మంత్రి పదవి ?

వాస్తవానికి నాగబాబు(Nagababu)కు మంత్రి పదవిని కేటాయించే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు గతంలోనే పచ్చజెండా ఊపారు.

Published By: HashtagU Telugu Desk
Nagababu Ap Govt Minister Post Jana Sena Tdp Govt

Nagababu : జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌  సోదరుడు నాగబాబుకు మంత్రి పదవీ యోగం ఎప్పుడు ? అందుకు ఇంకా ఎంత టైం పట్టొచ్చు ? నాగబాబుకు మంత్రి పదవి దక్కడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది ? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read :HMPV Virus China: చైనాలో ప్రాణాంత‌క‌ వైరస్.. భార‌త‌దేశంపై ప్ర‌భావం ఎంత‌?

వాస్తవానికి నాగబాబు(Nagababu)కు మంత్రి పదవిని కేటాయించే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు గతంలోనే పచ్చజెండా ఊపారు. ఆయనను ఎమ్మెల్సీగా చేసి.. మంత్రి పదవిని కేటాయిస్తానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారమే.. కార్యాచరణ కూడా జరుగుతోంది. ఓవరాల్‌గా నాగబాబుకు మంత్రి పదవి దక్కేందుకు కనీసం ఇంకో 100 రోజుల టైం పట్టేలా ఉంది. ఎందుకంటే.. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ఐదుగురి పదవీకాలం మార్చి 29వ తేదీతో కంప్లీట్ కాబోతోంది. పదవీ కాలం పూర్తి కాబోతున్న ఎమ్మెల్సీలలో దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్‌బాబు, బి.తిరుమలనాయుడు, యనమల రామకృష్ణుడు టీడీపీ సభ్యులే.  వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి ఇప్పటికే రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఇప్పటికే ఖాళీగా ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరిలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఐదు స్థానాల్లో ఎమ్మెల్సీలుగా గెలిచేవారు మార్చి 29వ తేదీ తర్వాతే ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపడతారు.

Also Read :Sirivennela Seetharamasatri : సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తూ అమెరికా తెలుగువాళ్లు స్పెషల్ సాంగ్..

వైఎస్సార్ సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌చక్రవర్తి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణల రాజీనామాలను ఇంకా శాసన మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. వాటిని త్వరలోనే ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఈ నలుగురు  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల్లో ఒక ఎమ్మెల్సీని (కర్రి పద్మశ్రీ) గవర్నర్ నామినేట్ చేశారు. అందుకే ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటును మినహాయించగా మిగిలిన మూడు స్థానాలను, పైన మనం చెప్పుకున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలతో కలుపుకొని మొత్తం 8 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంఖ్యాబలం టీడీపీ, జనసేన,బీజేపీ కూటమికే ఉంది. అందుకే 8 ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఎన్డీయే కూటమికే దక్కుతాయి.  కర్రి పద్మశ్రీ రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ ఆమోదించాక.. కొత్త అభ్యర్థిని గవర్నర్‌ నామినేట్‌ చేయనున్నారు. గవర్నర్ కోటాలో నాగబాబుకు అవకాశం దక్కొచ్చని అంటున్నారు.  ఏ రకంగా చూసినా ఏప్రిల్ 10 వరకు నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఆ తర్వాతే ఆయనకు అది దక్కే సూచనలు ఉన్నాయి.

  Last Updated: 05 Jan 2025, 08:15 AM IST