Ex Gratia: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తులు మరణించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా (Ex Gratia) ప్రకటిస్తున్నట్లు మంత్రి అనిగాని సత్యప్రసాద్ గురువారం ఉదయం పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రుయా ఆస్పత్రి వద్ద మంత్రి ఆనం మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఘటనకు తొందరపాటు చర్య లేదా సమన్వయా లోపమా అనేది విచారణలో వెళ్లడవుతుంది. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం. మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపుతాం. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామని ఆయన అన్నారు.
Also Read: Tirupati Stampede Incident : మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు
మంత్రి అనిత మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్రాణాలను కాపాడబోయిన సమయంలో జరిగిన సంఘటన ఇది. మొత్తం ఆరు మంది మరణించారు. ఇందులో అధికంగా విశాఖ జిల్లా వాసులు ఉన్నారు. ఎవరి వైఫల్యం అనే విషయం సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుంది. ఇది ప్రమాదమా? కుట్ర కోణామా అనే విషయం కూడా విచారణలో వెల్లడవుతుంది. ఈ ఘటనపై ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రికి అధికారులు ఇవ్వనున్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తాం. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో సహకరించాలి. అర్థం చేసుకోవాలి. ఇది దురదృష్టకర సంఘటన అని మంత్రి అనిత తెలిపారు.
ఎవరూ కారణం?
తొక్కిసలాటకు అధికారుల సమన్వయలోపమే కారణమని తెలుస్తోంది. అలాగే ఇందులో పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కౌంటర్‌లో పనిచేసే ఒక సిబ్బంది అస్వస్థతకు గురికావడంతో అతన్ని బయటకు తీసుకెళ్లేందుకు స్థానిక పోలీస్ గేట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే టికెట్ల కోసం గేట్లు ఓపెన్ చేశారని భక్తులు భావించడంతో ఈ తోపులాట జరిగిందని ప్రాథమిక సమాచారం. ఈ తొక్కిసలాట ఘటనలో మొత్తం ఆరుగురు కన్నుమూశారు.