Adani : అదానీ.. జగన్.. తెర వెనక మోడీ

ప్రపంచ ధనవంతులలోనే అతి ముఖ్యమైన వ్యాపారవేత్త, భారతదేశంలో అతి వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం, గౌతం అదానీ (Gautam Adani) గురువారం నాడు గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్ వచ్చారు.

  • Written By:
  • Updated On - September 29, 2023 / 11:44 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Gautam Adani : ప్రపంచ ధనవంతులలోనే అతి ముఖ్యమైన వ్యాపారవేత్త, భారతదేశంలో అతి వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం, గౌతం అదానీ గురువారం నాడు గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్ వచ్చారు. అది అధికార పర్యటనో.. వ్యాపార పర్యటనో.. జగన్ కుటుంబంతో వ్యక్తిగత సంబంధాల పర్యటనో తెలియదు. కానీ ఎవరికీ తెలియకుండా అతి రహస్యంగా ముగిద్దాం అనుకున్న ఈ కార్యక్రమం బట్టబయలు అయిపోయింది. గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి రాగానే అక్కడ ఆయనకు రాచ మర్యాదలతో సకల స్వాగత సత్కారాలు లభించాయి. ఆయన సిబ్బందితోపాటు, ప్రత్యేక పోలీసు ఎస్కార్టుతో ఆయన ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లడం, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని ముఖ్యమంత్రి జగన్ నివాసమైన తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లడం చకచకా జరిగిపోయింది. జగన్ దంపతులతో ఆయన రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఇది అధికారిక పర్యటన అయితే ముందుగానే వార్తలు తెలిసేవి. ఇతర అధికారులు, మంత్రివర్గ బృందాలతో పాటు అధికారికమైన సమావేశం జరిగేది. కానీ ఇది అలా జరిగినట్టుగా లేదు. కేవలం గౌతం అదానీ (Gautam Adani) జగన్ ఇంటికి వెళ్లడం, జగన్ దంపతులతో మంతనాలు సాగించడం, రెండు గంటలు వారితో సంభాషణ జరిపిన తర్వాత ఎంత గుట్టుచప్పుడు కాకుండా వచ్చాడో అంతే గుట్టుగా తిరిగి తన ప్రత్యేక విమానంలో వెళ్లిపోయాడు.

అంతా బాగానే ఉంది. ఇంతకీ గౌతమ్ అదానీ (Gautam Adani)తో జగన్ బంధం ఏమిటి? ఇప్పటికే దేశంలో అదానీ కార్పొరేట్ మహాశక్తిగా ఎదిగిన క్రమం గురించి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిండెన్స్ బర్గ్ లాంటి సంస్థలు, ఇతర విదేశీ సంస్థలు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్ మార్కెట్లో చేసిన అవకతవకలు, నేరపూరిత చర్యలు బయటపెట్టాయి. ఇలాంటి వ్యక్తి మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పల్లెత్తి మాట్లాడలేదు. బహిరంగంగా ఒక విమర్శ చేయలేదు. విచారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మోడీ, అదానీ మధ్య బంధం ఈనాటిది కాదని ప్రపంచం కోడై కూస్తోంది. గుజరాత్ లో జరిగిన నరమేధం సందర్భంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు దేశమంతా ఆయన పాత్రను వేలెత్తి చూపించిన విషయం అందరికీ విదితమే. ఆయన వెనుక గౌతమ్ అదానీ (Gautam Adani) మరికొందరు ఆయన అనుయాయులైన కార్పొరేట్లు గట్టిగా నిలబడ్డారు. మోడీ ప్రధాని అయిన సందర్భంలో ఢిల్లీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు అదానీ ప్రత్యేక విమానంలో వెళ్లినట్టు ఖచ్చితమైన వార్తలు ఉన్నాయి. అంతేకాదు గౌతమ్ అదానీ ఆస్తులు బిజెపి ప్రభుత్వం కొనసాగిన ఈ తొమ్మిదిన్నరేళ్ళ కాలంలో అనేక రెట్లు అనూహ్యంగా పెరిగాయని గణాంకాలే చెబుతున్నాయి.

మరి ఇంత వివాదాస్పదమైన కార్పొరేట్ దిగ్గజం ఆంధ్ర ప్రదేశ్ తో కొనసాగిస్తున్న సంబంధాలలో ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది. అదానీ ఎదుర్కొంటున్న విమర్శల విషయంలో గానీ, మోడీ ఆదానీల మధ్య ఉన్న సంబంధాల విషయంలో వచ్చిన వార్తల పట్ల గాని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒక మాట కూడా మాట్లాడలేదు. అదానీ (Gautam Adani) ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు కైవసం చేసుకున్నాడు. సౌర,వాయు, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఆయన వశమయ్యాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో గృహాల్లో స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగించే కాంట్రాక్ట్ కూడా ఆదానీ కంపెనీ చేజిక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ తో విడరాని బంధం అదానీకి ఎప్పుడో ఏర్పడిందని వీటి ద్వారా అర్థమవుతుంది. అయితే తాజాగా మోడీ ఎదుర్కొంటున్న అదానీ వివాదం నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఎందుకు రహస్యంగా అదానీని కలిసినట్టు? వీరిద్దరి మధ్య ఎలాంటి రాయబారం జరిగినట్టు? తెర వెనక ఉన్నది నరేంద్ర మోడీయేనా? ఇలాంటి సందేహాలు తలెత్తడానికి ఆస్కారం ఇచ్చింది అదానీ తాజా పర్యటన. ఎంత రహస్యంగా అదానీ రాకపోకలు జరిగినా అదానీతో జగన్ రహస్యమంతనాల అంతరార్థం రానున్న రోజుల్లో ఒక రాద్ధాంతం కాకమానదు. దీనికి జగన్ జవాబు ఏం చెప్తారో చూడాలి.

Also Read:  M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది