President AP Tour : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఈ మేరకు ద్రౌపది ముర్ముకు వారు పూల బొకేలు ఇచ్చి స్వాగతించారు. ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోలీసు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు బయల్దేరి వెళ్లారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ(ఎయిమ్స్) స్నాతకోత్సవంలో ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నారు. అంతేకాక..నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలను కూడా అందించనున్నారు.
కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్న నేపథ్యంలోనే పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 800 పోలీసులతో పటిష్ట బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం ద్రౌపదీ ముర్ము సాయంత్రం 4:15కు విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరుతారని అధికార వర్గాలు ప్రకటించాయి.
Read Also: Assembly : అప్పులపై హరీష్ – భట్టీల మధ్య వాడీవేడి చర్చ