Site icon HashtagU Telugu

Cyber Fraud : ట్రాఫిక్ చ‌లానా పేరిట కేటుగాళ్ల‌ మెసేజ్..రూ. 1.36ల‌క్ష‌లు మాయం

A scam message in the name of traffic challan..Rs. 1.36 lakhs disappeared

A scam message in the name of traffic challan..Rs. 1.36 lakhs disappeared

Cyber Fraud : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో ఒక హోటల్ నిర్వాహకుడు ట్రాఫిక్ చలానా పేరుతో మోసగాళ్ల బారిన పడి ఏకంగా రూ. 1.36 లక్షలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఈ మోసం వెనుక ఉన్న దుర్మార్గపు వ్యూహం ఇప్పుడు సైబర్ క్రైమ్ అధికారుల దృష్టికి వచ్చి విచారణ సాగుతోంది. స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవించుతున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశంలో మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. గాను చలానా వేయబడింది. వెంటనే చెల్లించండి అంటూ ఒక లింక్‌తోపాటు మెసేజ్‌ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారిక ఫైల్ ఏపీకే రూపంలో రావడంతో, నిజమైనదేనేమోనన్న అనుమానంలో నిరంజన్ రెడ్డి ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. లింక్ ఓపెన్ చేయగానే, ఒక అపరిచిత యాప్ డౌన్‌లోడ్ అయ్యింది. దానిని ఓపెన్ చేయగానే ఓటీపీ అడిగింది. అయితే, అప్పటికే మోసపోతున్నానేమోనన్న అనుమానంతో ఆయన వెంటనే ఆ యాప్‌ను మూసివేశారు.

Read Also: APL 2025 : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా తుంగభద్ర వారియర్స్.

కానీ, అప్పటికే సైబర్ మోసగాళ్లు తమ పని మొదలుపెట్టారు. శనివారం ఉదయం అనుమానాస్పదంగా మూడు వేర్వేరు లావాదేవీలలో అతని క్రెడిట్ కార్డులోంచి మొదటగా రూ. 61,000, తర్వాత రూ. 32,000, ఆపై మళ్లీ రూ. 20,999 మొత్తాలు తీసుకున్నట్లు సందేశాలు వచ్చాయి. మొత్తంగా రూ. 1.36 లక్షలు ఖాతా నుండి డ్రా చేశారు. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్లు కొన్నట్లు సందేశాలు రావడంతో, నిరంజన్ రెడ్డికి తేరుకున్నాడే కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఆయన వెంటనే తన క్రెడిట్ కార్డు బ్లాక్ చేయించినప్పటికీ, అప్పటికే మోసగాళ్లు లావాదేవీలు ముగించేశారు. బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును సైబర్ క్రైమ్ విభాగం చేపట్టింది. విచారణలో మోసానికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్రకు చెందినవాడిగా గుర్తించారు. ప్రస్తుతానికి అతని వివరాలను సేకరించి, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన సాంకేతిక నిపుణులు, పోలీసులందరిలో అప్రమత్తత పెంచాల్సిన అవసరం ఎంత ఉన్నదీ గుర్తు చేస్తోంది. ప్రజలు ట్రాఫిక్ చలానాలు, బ్యాంకింగ్ లింకులు వంటి వాటిపై ఎక్కువగా శ్రద్ధ వహించాలని, ఏదైనా సందేహాస్పద లింక్ వస్తే వెంటనే అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించాలని సైబర్ క్రైమ్ శాఖ సూచిస్తోంది.

Read Also: Egg : గుడ్డులోని పచ్చసొన తినట్లేదా?