A Letter To The Family Of YS: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తిక్కరేగిన ఏపీ రాష్ట్ర ప్రజలు రాస్తున్న బహిరంగ లేఖ (A Letter To The Family Of YS) అని ఒక లెటర్ వైరల్ అవుతోంది. అందులో గత వారం రోజులుగా ఆస్తుల పంపకాల్లో వచ్చిన వివాదాలపై వైఎస్ జగన్- షర్మిల ల మధ్య లేఖలు, కౌంటర్ లేఖలు, ఆరోపణలు, దాడులు, ఎదురు దాడులు, ఆవేదన, ఆక్రందనలు చూసి .రాష్ట్రంలో ఉన్న పౌరునిగా మెజారిటీ రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ కుటుంబానికి రాస్తున్న బహిరంగ లేఖ ఇది పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఒక దివంగత ముఖ్యమంత్రి కుటుంబంలో, స్వయంగా ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కొడుకు, సొంత సోదరితో, తల్లితో ఆస్తుల పంపకం కోసం పడుతున్న ఘర్షణ, రోడ్డెక్కి చేస్తున్న రచ్చ వెగటు పుట్టిస్తోంది. అసహ్యం కల్గిస్తోంది. ఏహ్యభావాన్ని(రోత) కల్పిస్తోందన్నారు.
దయచేసి ఈ దిక్కుమాలిన వివాదానికి అంతం పలకండి. ఈ డ్రామాకు తెరదించండి. ఈ రాష్ట్ర ప్రజలుగా, రాజకీయాలను పరిశీస్తున్న వారిగా, దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిగా మాకూ అనేక విషయాలు తెలుసు. మీ కుటుంబానికి సంబంధించి 2004కు ముందున్న అప్పులు ఎలా మాయం అయ్యాయో తెలుసు. అలాగే 2004 తరువాత వేల కోట్ల ఆస్తులు, పెద్ద పెద్ద కంపెనీలు, మీడియా చానళ్లు, పేపర్లు, పరిశ్రమలు, కోట్ల విలువైన షేర్లు ఎలా వచ్చాయో, కాకలు దీరిన పారిశ్రామిక వేత్తలు సైతం నిర్మించలేని వ్యాపార సామాజ్యాలు ఎలా నిర్మితం అయ్యాయో కూడా తెలుసు. అయితే స్వతహాగా సెంటిమెంట్ ఎక్కువ ఉండే ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా చనిపోయిన పెద్దాయన మీద ఉన్న గౌరవంతో మీకు మద్దతుగా నిలిచాం. అధికారాన్ని అందించాం. కానీ మీరేం చేశారో.. రాష్ట్రం ఎలా అయ్యిందో? మా బిడ్డల భవిష్యత్ ఎంత చీకటి మయం అయ్యిందో తెలుసుకుని 2024 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చాం. ఇప్పుడిప్పుడే కోలుకుని బతుకుల్లో వెలుగులు చూస్తున్నాం.
Also Read: Diwali Greetings: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్
ఇలాంటి సమయంలో దొంగిలించిన సొమ్ములో వాటాల కుదరక గొడవలు పడిన దొంగల్లా మీరు పడుతున్న ఘర్షణ చాలా నీచంగా ఉంది. అక్రమ ఆస్తులు, వాటి ద్వారా పదవులు, ఆ అధికారం ద్వారా మళ్లీ వేల కోట్ల దోపిడీ మాత్రమే తెలిసిన మీకు, మీ ఈ భాగోతం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టకపోవచ్చు. దేశంలో మరే దివంగత ముఖ్యమంత్రి, మరే మాజీ ముఖ్యమంత్రి సొంత కుటుంబంలో ఆస్తుల కోసం ఇంతగా దిగజారి, నైతికత అనేది లేకుండా వ్యవహరించడం ప్రజలుగా మేం చూడలేదు. భవిష్యత్ లో చూడలేము కూడా అని రాసుకొచ్చారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో రాష్ట్ర ప్రజలుగా మేమంతా మరింత షాక్ కు గురయ్యింది దేనికంటే.. ఇంప్రెస్ చెయ్యడానికి పసుపు చీర అంటూ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సాయిరెడ్డి మాట్లాడడం. ఈ వివాదం ఏకంగా రాష్ట్రానికే మంచిది కాదని ఆమె చెప్పడం. రాష్ట్రానికి మంచిది కానిది, జరగకూడదనిది 2019లోనే జరిగిపోయింది. ఇక మళ్లీ అది జరగదు. రాష్ట్ర ప్రజలుగా మాకు ఆ క్లారిటీ ఉండబట్టే మొన్న ఆ తీర్పు ఇచ్చాం. ఇందుమూలంగా యావత్ రాష్ట్ర ప్రజలు మీ కుటుంబానికి విన్నవించి రాసేది ఏంటంటే.. తిన్నదేదో తిన్నారు.. నలుగురు పెద్దలను పిలిచి వారి సమక్షంలో సామరస్యంగా దొంగ సొమ్ము పంచుకోండి. ఈ రచ్చ ఆపండి. ప్రజలకు పనికొచ్చే పనేదైనా చేయండి. రాష్ట్ర ప్రజల బహిరంగ లేఖను పరిగణలోకి తీసుకోమని కోరుతూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజారిటీ ప్రజానీకం అని ఒక లేఖ వైరల్ అవుతోంది.