ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలను కుదిపేస్తూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఈ సంఘటనను సాధారణ ప్రమాదంగా కాకుండా ‘మాకు ప్రమాదం జరిగేలా కుట్ర పన్నారు’ అని బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రగిలించాయి. “అమ్మవారి కటాక్షం వలనే ప్రాణాలు దక్కాయి. మమ్మల్ని అంతం చేయాలని ఎందుకు చూశారు?” అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
ఈ ఘటనపై బొత్స సత్యనారాయణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే విషయాన్ని కూడా ప్రకటించారు. తాను శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం యాదృచ్ఛికం కాదని, దీని వెనుక దాగి ఉన్న కుట్రదారులు ఎవరన్నది బయటపడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో స్థానికంగా రాజకీయ అనుమానాలు ముసురుకున్నాయి. బొత్స వర్గం ఈ ఘటనను ‘సూచిత ప్రణాళిక’గా భావిస్తుండగా, ప్రత్యర్థులు మాత్రం ‘సాంకేతిక లోపం’ వల్ల వేదిక కూలిందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, బొత్స సత్యనారాయణ చేసిన ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కోణం తీసుకొచ్చాయి. విజయనగరం జిల్లా రాజకీయంగా సున్నితమైన ప్రాంతం కావడంతో, అక్కడ జరిగిన ఈ ఘటనకు రాజకీయ వర్ణం ఎక్కింది. పోలీసులు ఇప్పటికే ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిర్వాహకులను, కాంట్రాక్టర్లను విచారిస్తున్నారు. అయితే, బొత్స వర్గం మాత్రం “ఇది కేవలం ప్రమాదం కాదు – రాజకీయ కుట్ర” అని పట్టుబడుతోంది. ఈ ఘటన నిజంగా యాదృచ్ఛికమా లేక రాజకీయ ఆడుగులలో భాగమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందనడంలో సందేహం లేదు.
