Election Results : రాజ‌కీయ సునామీ ఆ రోజే.!

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ సునామీ ముంచుకొస్తోంది. ఈనెల 10వ తేదీ ఆ సునామీకి ముహూర్తం. ఆ రోజున `పాంచ్` ప‌టాక పేల‌నుంది.

  • Written By:
  • Publish Date - March 5, 2022 / 02:17 PM IST

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ సునామీ ముంచుకొస్తోంది. ఈనెల 10వ తేదీ ఆ సునామీకి ముహూర్తం. ఆ రోజున `పాంచ్` ప‌టాక పేల‌నుంది. యూపీతో పాటు ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు బీజేపీకి వ్య‌తిరేకంగా ఉంటే, మోడీపై ప్రాంతీయ పార్టీల అధిప‌తులు తిర‌గ‌బ‌డే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉంటోన్న జ‌గ‌న్‌, బాబు, కేసీఆర్ పోటీప‌డి మోడీని ఢీ కొట్టే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక వేళ బీజేపీకి అనుకూలంగా ఆ ఫ‌లితాలు ఉంటే మాత్రం తెలంగాణ కాంగ్రెస్, ఏపీ టీడీపీ దాదాపుగా ఖాళీ అయ్యే ప్ర‌మాదం ముంచుకొస్తుంది.ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్, గోవా, మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈనెల 10వ తేదీన ఫ‌లితాలు రాబోతున్నాయి. ప్ర‌స్తుతం యూపీ, ఉత్త‌రాఖండ్ , గోవా రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వం ఉంది. బీజేపీ కూట‌మి మ‌ణిపూర్ లో అధికారంలో ఉండ‌గా పంజాబ్ మాత్ర‌మే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాం. ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని మ‌ళ్లీ బీజేపీ నిల‌బెట్టుకోలేక‌పోతే, దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పులు సంభ‌వించే అవకాశం లేక‌పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌ర్వేల సారాంశం ప్ర‌కారం పంజాబ్ మిన‌హా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని కేంద్రం ఫోక‌స్ చేస్తోంది.

Also Read : హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. అసెంబ్లీలో 3 రాజ‌ధానుల బిల్లు..?

ఒక వేళ యూపీ, ఉత్త‌రాఖండ్ లో అధికారాన్ని కోల్పోతే, రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఏకాభిప్రాయాన్ని సాధించ‌డం బీజేపీకి సాధ్యంకాదు. పైగా మోడీ వ్య‌తిరేక శ‌క్తులు ఏకం కావ‌డానికి అనువైన స‌మ‌యంగా ఉంది. ఇప్ప‌టికే ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి కేసీఆర్‌, స్టాలిన్ చాలా సీరియ‌స్ గా మోడీ వ్య‌తిరేక పావులు క‌దుపుతున్నారు. తెర వెనుక చంద్ర‌బాబు హాట్ లైన్ రాజ‌కీయాల‌ను న‌డుపుతున్నాడ‌ని ఆయన స‌న్నిహితులు చెప్పుకుంటున్నారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి వెనుకాడుతోన్న కేంద్రంపై జ‌గ‌న్ కూడా వ్య‌తిరేక బావుటా ఎగ‌రేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే బ‌ల‌హీనంగా ఉన్న బీజేపీ ఏపీలో ఉనికి కోల్పోయే ప్ర‌మాదం ఉంది. ఇక తెలంగాణ‌లో ఊపు మీదున్న బీజేపీ చ‌తికిల ప‌డేందుకు అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు పెరిగే ఛాన్స్ ఉంది. ఫ‌లితంగా తెలంగాణ‌లో పొలిటిక‌ల్ వార్ కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ మ‌ధ్య ఫిక్స్ కానుంది.ఒక వేళ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ హ‌వా కొన‌సాగితే, ఏపీలోని టీడీపీ సీనియ‌ర్లు చాలా మంది బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న సుమారు 45 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలోకి జంప్ అవుతార‌ని టాక్‌. అదే జ‌రిగితే, ఏపీలో వార్ వైసీపీ, బీజేపీ మ‌ధ్య ఫిక్స్ కానుంది. టీడీపీ ఖాళీ అయ్యే ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఆ పార్టీలోనే అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ కావ‌డంతో పాటు ఏపీ త‌ర‌హాలో పూర్తిగా ఉనికి కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి మీద చాలా మంది అసంతృప్తిగా ఉన్న్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు ప్రాధాన్యం ఇస్తూ సుదీర్ఘంగా కాంగ్రెస్ లో ఉన్న లీడ‌ర్ల‌ను తొక్కేస్తున్నాడ‌ని అప‌వాదు ఉంది. తాజాగా సీనియ‌ర్ లీడ‌ర్ వీహెచ్ బాహాటంగా ఆ విష‌యాన్ని మీడియాకు చెప్పాడు. మాజీ పీసీసీ పొన్నాల ల‌క్ష్మ‌య్య‌లాంటి వాళ్ల‌ను కూడా రేవంత్ తొక్కేస్తున్నాడ‌ని వీహెచ్ వాపోయాడు. ఇలాంటి ప‌రిస్తితుల్లో సీనియ‌ర్లు, ప్ర‌జ‌ల్లో ఫోక‌స్ ఉన్న నాయ‌కులు బీజేపీ గూటికి చేర‌డానికి అవ‌కాశాలు దండిగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు ఏపీ టీడీపీ , తెలంగాణ కాంగ్రెస్ భ‌విష్య‌త్ కు ముడిప‌డి ఉన్నాయి. ఈనెల 10వ తేదీ ఫ‌లితాల‌పై ఆయా రాష్ట్రాల్లోని పార్టీల కంటే తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల్లో ఎక్కువ‌గా ద‌డ పుట్టిస్తున్నాయి. మార్చి 10వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ సునామీకి కేంద్ర బిందువుగా మారింది. ఆ రోజు నుంచి ఎవ‌రి జాత‌కాలు ఎలా మార‌బోతున్నాయో లెక్క‌పెట్టుకోవ‌చ్చన్న‌మాట‌.