Union Budget 2025: తెలుగు రాష్ట్రాలు 2025 కేంద్ర బడ్జెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. రెండు రాష్ట్రాలు ఉచిత పథకాల కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంతో, ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎంత సాయం అందిస్తుందో అన్న ప్రశ్న కీలకంగా మారింది. భారీ ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఉంటుంది కాని, రాష్టాలు కేంద్రం నుంచి ఎంత నిధులు పొందుతాయనేది నిర్ధారించాలి.
Telangana Number 1 : ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించిన ‘తెలంగాణ’ ఘనతలివీ
అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి నిధుల అభ్యర్థన
గత బడ్జెట్‌లో అమరావతి నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించగా, ఇవి అప్పుల రూపంలో ఉండి, అందువల్ల పనులు వేగంగా కొనసాగించడం కష్టం కావడంతో, ఈసారి మరిన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దావోస్ టూర్ అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యి, అవసరమైన నిధులపై చర్చించారు. ఫిబ్రవరి చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇదేకాకుండా.. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం, అమరావతి నిర్మాణం కోసం కేంద్రం వద్ద హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ. 12,500 కోట్లను కేటాయించగా, ఇది 2028 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను త్వరగా మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.
ఆర్ఆర్ఆర్, మెట్రో రెండో దశ.. భారీ నిధుల అభ్యర్థన
తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం రూ. 34,367 కోట్లు, హైదరాబాద్ మెట్రో రెండో దశకు రూ. 24,269 కోట్లు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం రూ. 14,100 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద నిధులు కేటాయించాలని కోరుతోంది. ఇవి కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి రూ. 1800 కోట్లకు పైగా రావాల్సి ఉంది.
రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవన తదితర ప్రాజెక్టులకు రూ. 1.63 లక్షల కోట్లు నిధులు అవసరమవుతాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రధాని మోదీని కలసి, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పెద్దన్న మాదిరిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అందించబడే నిధుల ఆధారంగా, రాష్ట్రాలు తమ బడ్జెట్‌ను తయారు చేయనున్నారు.