మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయాలతో బయటపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల దగ్గర చీమకుర్తి వైపు నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా కనిగిరి, పామూరుకు చెందినవారిగా చెబుతున్నారు. అందరూ చూస్తుండగానే బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేసి, గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాలోని కలికిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఉదయం 5.30-6.30 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. రాయవరం పలకల క్వారీల దగ్గర బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టినట్లు సమాచారం. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. టిప్పర్ అతివేగమే ఈ ఘటనకు కారణమని అంటున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. అయితే బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 6304285613, 9985733999, 7989537285, 9703578434 అందుబాటులోకి తెచ్చారు.
మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
గతేడాది కర్నూలులో ప్రమాదం
గతేడాది అక్టోబర్‌లో కర్నూలు జిల్లా చిన్న టేకూరు దగ్గర కూడా ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది చనిపోయారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా జాతీయ రహదారి 44పై బస్సు బైక్‌ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో బయటకు రాలేకపోయారు. 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం నుంచి 22 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మళ్లీ ఇప్పుడు మార్కాపురం జిల్లాలోనూ బస్సులో మంటలు చెలరేగి 10 మంది చనిపోయారు.
