Site icon HashtagU Telugu

Ram Mohan Naidu : మానవ తప్పిదాలతో విమాన ప్రమాదాలు 10 శాతం పెరిగాయ్ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Air Incidents Human Errors Aviation Minister Ram Mohan Naidu

Ram Mohan Naidu : మన దేశంలో విమాన ప్రమాదాలపై విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కీలక వివరాలను వెల్లడించారు.  మానవ తప్పిదాల వల్ల జరిగే విమాన ప్రమాదాల సంఖ్య దాదాపు 10 శాతం దాకా పెరిగిందని ఆయన తెలిపారు. భారత విమానయాన రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్వహించిన తనిఖీల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయని చెప్పారు. విమాన ప్రమాదాలకు సంబంధించిన కారణాలపై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొలి జాతీయ భద్రతా సదస్సులో  రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తూ ఈ వివరాలను తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో 80 శాతం దాకా మానవ తప్పిదాల వల్లే చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. అయితే క్రమంగా మానవ తప్పిదాల సంఖ్య తగ్గుతుండటం సానుకూల పరిణామమన్నారు.

Also Read :OpenAI Account Hacked : ‘ఓపెన్‌ ఏఐ’ ‘ఎక్స్‌’ అకౌంట్ హ్యాక్‌.. హ్యాకర్లు ఏం పోస్ట్ చేశారంటే..

ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో 91 విమాన ప్రమాదాల వివరాలను పరిశోధించగా నిర్వహణ ప్రమాణాల్లో లోపాల వల్లే  ఈ ప్రమాదాలు జరిగాయని తేలిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) గుర్తు చేశారు. అందుకే విమానయాన సంస్థలు సిబ్బందికి నైపుణ్యాలను పెంచడంపై ఫోకస్ చేయాలని సూచించారు.  విమానాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలను పాటించాలన్నారు. ప్రయాణికుల భద్రతకే పెద్దపీట వేయాలని కోరారు. ఈక్రమంలో ఏవియేషన్ నిపుణులు, పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి వారిని మెరుగుపర్చాలన్నారు. అధునాతన మానసిక పరిశోధనల ఫలితాలను ఈ శిక్షణా కార్యక్రమాలకు అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘పైలట్ల ప్రవర్తన, పనితీరును ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడటానికి కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతలను వాడుకోవాలి’’ అని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. పటిష్టమైన స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లతో పరిశ్రమ నిపుణులను ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంచాలన్నారు.