సోషల్ మీడియా దిగ్గజం మెటాలో మరోసారి ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో దూసుకెళ్లేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న సంస్థ.. ఖర్చులను తగ్గించుకునేందుకు ఏకంగా 20 శాతం మంది సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం, కచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు.
కంపెనీ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ గత కొంతకాలంగా జనరేటివ్ ఏఐపై పూర్తిగా దృష్టి సారించారు. దీని కోసం పరిశోధకులకు భారీ ప్యాకేజీలు ఇవ్వడంతో పాటు డేటా సెంటర్ల నిర్మాణానికి బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న వ్యయాలను నియంత్రించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. “గతంలో పెద్ద బృందం చేసే పనిని, ఇప్పుడు ఏఐ సాయంతో ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి చేయగలడు” అని జుకర్‌బర్గ్ ఇటీవలే వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.
డిసెంబర్ 31 నాటికి మెటాలో సుమారు 79,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా ప్రణాళిక అమలైతే దాదాపు 16,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే 2022లో 11,000 మందిని, 2023లో 10,000 మందిని మెటా తొలగించింది. ఈసారి జరగబోయే తొలగింపులు సంస్థ చరిత్రలోనే కీలకమైనవిగా మారనున్నాయి.
కేవలం మెటా మాత్రమే కాదు, ఇతర టెక్ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఈ ఏడాది అమెజాన్ 16,000 మందిని తొలగించగా, ‘బ్లాక్’ అనే ఫిన్‌టెక్ సంస్థ కూడా ఏఐ వినియోగం పెరగడంతో సిబ్బందిని తగ్గించుకుంది. ఏఐ టెక్నాలజీ రాకతో తక్కువ సిబ్బందితోనే అధిక ఫలితాలు సాధించవచ్చని కంపెనీలు భావిస్తుండటమే ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
