Zoom Layoffs: 1,300 ఉద్యోగాలకు కోతవేసిన జూమ్

కమ్యూనికేషన్‌ (Communication) టెక్నాలజీ సంస్థ జూమ్‌ భారీగా ఉద్యోగాల(lay-offs) కోతను ప్రకటించింది.

కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ జూమ్‌ (Zoom) భారీగా ఉద్యోగాల(lay-offs) కోతను ప్రకటించింది. మొత్తం 1,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అమెరికాలో లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులకు మరో అర గంటలో ఈమెయిల్‌ వస్తుందని జూమ్‌ సంస్థ సీఈవో ఎరిక్‌ యువాన్‌ కంపెనీ అధికారిక బ్లాగ్‌లో ప్రకటించారు. లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులు ప్రతిభావంతులు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులుగా ఆయన అభివర్ణించారు.

‘‘తొలగిస్తున్న ఉద్యోగుల జాబితాలో ఉన్న అమెరికాలో పనిచేసే వారి ఈ మెయిల్స్‌ ఇన్‌ బాక్స్‌లకు మరో 30 నిమిషాల్లో సందేశాలు వస్తాయి. ఇక అమెరికా బయట పనిచేసేవారి విషయంలో స్థానిక నిబంధనలకనుగుణంగా నడుచుకొంటాం’’ అని యువాన్‌ పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న సిబ్బందికి చట్ట ప్రకారం 16 వారాల వేతనం, హెల్త్‌కేర్‌ కవరేజీ,ఆరునెలల పాటు స్టాక్‌ ఆప్షన్‌పై అధికారం ఇవ్వగా.. అమెరికాయేత ఉద్యోగుల కోసం ఆగస్టు 9వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇక అమెరికాయేతర ప్రదేశాల్లోని జూమీస్‌ (జూమ్‌ ఉద్యోగులు)కు స్థానిక చట్టాలను పరిగణనలోకి తీసుకొంటే ఇదే వర్తిస్తుంది.

ఉద్యోగాల కోత విధిస్తున్న టెక్‌ కంపెనీల జాబితాలోకి జూమ్‌ (Zoom) కూడా వచ్చి చేరింది. కొవిడ్‌ సమయంలో గిరాకీ పెరగడంతో చాలా టెక్‌ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. కానీ, పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లు తగ్గడంతో ఈ కంపెనీల రెవెన్యూలు కూడా తగ్గాయి. ‘‘వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితులను తొలగించాడనికి జూమ్‌ను ఏర్పాటు చేశాం. కొవిడ్‌ సమయంలో మా కంపెనీ దశ మారింది. దీంతో ప్రజల మధ్య కనెక్టివిటీని పెంచడానికి వేగవంతంగా నియామకాలు చేపట్టాం. 24 నెలల్లో మా సంస్థ 3 రెట్లు పెరిగింది. భవిష్యత్తులో కూడా మా సృజనాత్మకత కొనసాగిస్తాం’’ అని ఎరిక్‌ యువాన్‌ బ్లాగ్‌లో పేర్కొన్నారు.

Also Read:  Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి!