Site icon HashtagU Telugu

Ukraine : ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి పై జెలెన్‌స్కీ ప్రశంసలు..‘స్పైడర్ వెబ్‌’ ఆపరేషన్‌పై పూర్తి వివరాలు..!

Zelensky praises Ukraine drone attack..Full details on Operation ‘Spider Web’..!

Zelensky praises Ukraine drone attack..Full details on Operation ‘Spider Web’..!

Ukraine : ఉక్రెయిన్‌ ఆధ్వర్యంలో రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి చేపట్టిన భారీ డ్రోన్‌ దాడిపై అధ్యక్షుడు వొలోడిమిర్‌ జెలెన్స్కీ ప్రశంసలు కురిపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ఈ దాడిని “అద్భుతమైన ఆపరేషన్‌”గా అభివర్ణించారు. ఈ దాడిలో ఉక్రెయిన్‌ సాయుధ దళాలు ప్రదర్శించిన ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యం నిజంగా ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు ‘స్పైడర్ వెబ్‌’ అనే పేరు పెట్టినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. శత్రు భూభాగంలోని కీలక వైమానిక స్థావరాలపై జరిగిన ఈ దాడిలో రష్యా సైన్యానికి చెందిన 40 పైచిలుకు యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. “ఇది సర్వసాధారణమైన దాడి కాదు. ఇది శత్రువు గుండెల్లోకి చొచ్చుకెళ్లి, అతని రక్షణ వ్యవస్థను పూర్తిగా మోసగించి చేసిన సాహసోపేతమైన చర్య” అని జెలెన్స్కీ చెప్పారు.

Read Also: CM Revanth Reddy : గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ చీఫ్‌ వాసిల్‌ మలియుక్‌ దీనిపై సమగ్ర వివరాలు వెల్లడించారు. “ఇది పూర్తిగా రష్యా భూభాగంలో లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్‌. ఉక్రెయిన్‌పై దాడులు చేయడానికి రష్యా ఉపయోగిస్తున్న ఆయుధ కేంద్రాలు, నిల్వలు, విమానాలపై దాడులు జరిపాం. మేము మానవ ప్రాణాలను దెబ్బతీయకుండా, కేవలం మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేయడం గర్వకారణం” అని చెప్పారు. ఈ దాడికి ముందు ఉక్రెయిన్‌ కొన్ని డ్రోన్లను కంటెయినర్లలో తరలించి, రష్యా భూభాగంలో లోతుగా ప్రవేశించింది. సుమారు 4,000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి ఈ దాడులు జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా ఇర్కుట్స్క్‌ ప్రాంతంలోని పలు వైమానిక స్థావరాలు ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి. అక్కడే 41 యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమైనట్లు రష్యన్‌ మీడియా నివేదించింది.

అంతేకాదు, ర్యాజన్, ముర్మన్స్క్‌ ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్‌ డ్రోన్లు బారులు తీరాయని రష్యా అధికారులు వెల్లడించారు. ఈ దాడులు రష్యా సైనిక వ్యవస్థలో గణనీయమైన నష్టాన్ని కలిగించాయని, డ్రోన్‌ టెక్నాలజీ వినియోగంలో ఉక్రెయిన్‌ స్థాయి అమోఘంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ దాడులు తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో సోమవారం జరగనున్న శాంతిచర్చలకు ముందు చోటు చేసుకోవడం విశేషం. ఉక్రెయిన్‌ ఈ దాడులతో తాము ఇంకా వెనక్కి తగ్గేదిలేదని, శాంతికి ముందు న్యాయం కోరుతూ తమ ప్రతాపాన్ని చూపించినట్లయింది. ఈ క్రమంలో జెలెన్స్కీ, తమ ప్రత్యేక బలగాలకు, సెక్యూరిటీ సర్వీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ “స్పైడర్ వెబ్‌” ఆపరేషన్‌ ఉక్రెయిన్‌ ఆధునిక యుద్ధ వ్యూహాల్లో కొత్త శకం మొదలుపెట్టిందని విశ్లేషకుల అభిప్రాయం. రష్యా వంతున ఇది ఒక మేల్కొలుపు ఘడియగా మారుతుందా, లేక ప్రతీకార దాడులకు దారితీయుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also: Heavy Rains : ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. కొండచరియలకు 34 మంది బలి