Xi Jinping: జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు.. తైవాన్‌ పై బలప్రయోగానికీ సిద్దమే..!

చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక సమావేశంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - October 16, 2022 / 04:04 PM IST

చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక సమావేశంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్‌పై చైనా సమగ్ర నియంత్రణను సాధించిందని, తైవాన్‌లో జోక్యం చేసుకుంటుందని చెప్పడాన్ని ఆయన ఖండించారు. హాంకాంగ్ పై తాము స్పష్టమైన ఆధిపత్యం సాధించి ఆ ప్రాంతాన్ని ఆందోళనల నుంచి పరిపాలన వైపు తీసుకొచ్చామని ఆయన అన్నారు. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం సరికాదన్న ఆయన.. తైవాన్ ను చైనా భూభాగంతో ఏకం చేయడానికి బలప్రయోగానికైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. వేర్పాటువాద శక్తులను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జిన్‌పింగ్ పేర్కొన్నారు.

తైవాన్‌పై జిన్‌పింగ్ మాట్లాడుతూ.. తైవాన్ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా చైనా పెద్ద పోరాటాన్ని సాగిస్తోందని, ప్రాదేశిక సమగ్రతను వ్యతిరేకించగల దృఢ నిశ్చయంతో ఉందని అన్నారు. తైవాన్‌లో “వేర్పాటువాదం, జోక్యానికి వ్యతిరేకంగా ప్రధాన పోరాటం” అని ప్రతిజ్ఞ చేస్తూనే.. గందరగోళం నుండి పరిపాలన వైపు వచ్చిన హాంకాంగ్ పరివర్తనను ఆయన ప్రశంసించారు. 96 మిలియన్ల సభ్యులతో కూడిన పార్టీ మానవ చరిత్రలో పేదరికంపై అతిపెద్ద పోరాటంలో విజయం సాధించింది అని జిన్‌పింగ్ అన్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) 20వ జాతీయ మహాసభలు అక్టోబర్ 16 నుంచి 22 వరకు జరగనున్నాయి.వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి సీపీసీ ఎన్నుకోనుంది. జిన్‌పింగ్‌ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపడుతున్నప్పటికీ అది జీవితకాలం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.