Site icon HashtagU Telugu

World Population: అరుదైన మైలురాయి.. ప్రపంచ జనాభా 800 కోట్లు..!

China Population

China Population

ప్రపంచ జనాభా అరుదైన మైలురాయిని అందుకుంది. నేటితో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బ్రిటన్‌లో ఓ పాప జననంతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కాగా ప్రపంచ జనాభా 700 కోట్ల నుంచి 800 కోట్లకు చేరేందుకు 12 ఏళ్ల సమయం పట్టింది. 2030 నాటికి 850 కోట్లకు, 2050 కల్లా 1040 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023 నాటికి చైనాను అధిగమించి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనుందని పేర్కొంది. ఇండియాలోనే ఈ 10 ఏళ్లలో జనాభా ఎక్కువగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రజారోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, వైద్యంలో మెరుగుదలల కారణంగా ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని UNO పేర్కొంది. ప్రపంచ జనాభా 1950 నుండి నెమ్మదిగా పెరుగుతోందని, 2020లో ఒక శాతం కంటే తక్కువకు పడిపోతుందని పేర్కొంది. ప్రపంచ జనాభా 700 కోట్ల నుంచి 800 కోట్లకు పెరగడానికి 12 సంవత్సరాలు పట్టిందని, కానీ.. 2037 నాటికే ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

వచ్చే 27 ఏళ్లలో ప్రపంచ జనాభాలో సగం జనాభా 8 దేశాల్లో నివసిస్తారని ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఎనిమిది దేశాల జనాభా అత్యధికంగా ఉంటుంది. 2050 నాటికి భారత్, పాకిస్థాన్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 50 శాతంగా ఉంటాయని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 72.8 ఏండ్లుగా ఉంది. 2050 నాటికి ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 77.2 ఏండ్లకు చేరుకుంటుందని అంచనా. స్త్రీల సగటు ఆయుఃప్రమాణం 73.4 ఏండ్లు కాగా పురుషుల ఆయుఃప్రమాణం 68.4 ఏండ్లుగా ఉండనుందని అంచనా.

Exit mobile version