Site icon HashtagU Telugu

Zelensky: రష్యా వస్తే.. మేము రాలేం: జెలెన్‌స్కీ

Missile Strikes Near Zelensky

Volodymyr Zelenskyy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరయ్యే పక్షంలో 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల గ్రూప్‌ ఇండోనేషియాలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో తాను పాల్గొనబోనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ గురువారం తెలిపారు. ఇండోనేషియాలో జరగనున్న జీ20 సమావేశాల్లో రష్యన్ ఫెడరేషన్ పాల్గొంటే.. ఉక్రెయిన్ ఆ సమావేశానికి దూరంగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇది యావత్ ఉక్రెయిన్ ప్రజల నిర్ణయమని తెలిపారు. ఈ సమావేశాలకు హాజరుకావాల్సిందిగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి తమకు ఆహ్వానం అందిందని చెప్పారు.

ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నవంబర్ 15-16 మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సిందిగా తనను ఆహ్వానించారని గ్రీస్ అధ్యక్షుడితో కైవ్‌లో చర్చల అనంతరం జెలెన్‌స్కీ విలేకరులతో అన్నారు. “నా వ్యక్తిగత స్థానం, ఉక్రెయిన్ యొక్క స్థానం ఏమిటంటే.. రష్యన్ ఫెడరేషన్ నాయకుడు పాల్గొంటే ఉక్రెయిన్ పాల్గొనదు. భవిష్యత్తులో అది ఎలా ఉంటుందో చూద్దాం” అని చెప్పాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు విడోడోతో టెలిఫోన్ ద్వారా మాట్లాడినట్లు, G20 సమ్మిట్‌తో పాటు నల్ల సముద్రం ధాన్యం ఒప్పందానికి సంబంధించిన సన్నాహాల గురించి చర్చించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. ఫిబ్రవరి 24న రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మాస్కో తన చర్యలను ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించింది.