Firing At Trump : మాజీ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనతో యావత్ అమెరికా ఉలిక్కిపడింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈఘటనలో ట్రంప్ కుడి చెవి భాగంలోకి బుల్లెట్(Firing At Trump) దూసుకెళ్లింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. బుల్లెట్‌ను వైద్యులు సర్జరీ చేసి తొలగించినట్లు తెలిసింది. కాల్పుల సౌండ్స్ వినగానే ట్రంప్ వేదిక చుట్టూ ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రంగంలోకి దిగి.. ఆయనను చుట్టుముట్టారు. వేదికపై నుంచి కిందికి దింపారు. ఇక్కడి వరకూ ఓకే అయితే ఓ ప్రత్యక్ష సాక్షి ‘బీబీసీ’కి చెప్పిన కథనం ఈ ఘటనలోని మరో కోణాన్ని మనకు చూపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
ప్రత్యక్షసాక్షి బీబీసీకి చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని నేను చూశాను. అతడు ఎన్నికల ప్రచార సభ జరుగుతున్న గ్రౌండ్‌కు సమీపంలోని ఓ భవనం పైకప్పుపైకి వెళ్తుండటాన్ని నేను చూశాను. ఆ భవనంపైకి వెళ్లేటప్పుడు అతడి చేతిలో రైఫిల్ ఉంది. దాదాపు 50 అడుగుల దూరం నుంచి ఆ షూటర్‌ను నేను గమనించాను. వెంటనే డౌట్ వచ్చి.. సమీపంలోని పోలీసులు, సీక్రెట్ సర్వీసు సిబ్బందికి సమాచారం కూడా అందించాను. మరెందుకో వాళ్లు స్పందించలేదు. ఓ పక్క భవనంపై షూటర్ రెడీగా ఉంటే.. మరో పక్క ట్రంప్ ఎందుకు ప్రసంగిస్తున్నారో నాకు అర్థం కాలేదు. అంతలోనే షూటర్ ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ వచ్చి ట్రంప్(Trump) కుడి చెవి భాగంలో తాకింది.. ఆ తర్వాతే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్పందించారు’’ అనిప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని అమెరికా భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ ప్రచార సభకు హాజరైన ఓ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.