Nuclear Testing: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు పరీక్షలకు (Nuclear Testing) సంబంధించిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ట్రంప్ చేసిన అణు పరీక్షల వ్యాఖ్యలపై అమెరికా స్పష్టత ఇవ్వాలని రష్యా శుక్రవారం (నవంబర్ 7, 2025) డిమాండ్ చేసింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ.. అమెరికా ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నా, రష్యాతో పాటు ప్రపంచ దేశాల నుంచి ప్రతిస్పందనలు రావడం ఖాయమని హెచ్చరించారు.
ట్రంప్ అణు పరీక్షల ప్రకటనతో అలజడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ చేస్తూ అణు ఆయుధాల పరీక్షను తక్షణమే ప్రారంభించాలని తాను ఆదేశించినట్లు తెలిపారు. ట్రంప్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలో ఏ ఇతర దేశం కంటే ఎక్కువ అణు ఆయుధాలను కలిగి ఉంది. ఇదంతా నా మొదటి పదవీకాలంలోనే సాధ్యమైంది. రష్యా రెండో స్థానంలో ఉంది. చైనా చాలా దూరంగా మూడో స్థానంలో ఉంది. కానీ వచ్చే ఐదేళ్లలో అది సమాన స్థాయికి చేరుకుంటుంది. ఇతర దేశాల పరీక్షా కార్యక్రమాల కారణంగా మా అణు ఆయుధాలను సమాన ప్రాతిపదికన పరీక్షించడం ప్రారంభించాలని నేను యుద్ధ విభాగాన్ని ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే మొదలవుతుందన్నారు.
Also Read: Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!
పుతిన్ నుండి అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక
ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం (నవంబర్ 5) తన ఉన్నతాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంభావ్య అణు ఆయుధ పరీక్షలపై దృఢమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రష్యా ఇప్పటివరకు సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (CTBT) కింద తన అన్ని బాధ్యతలను కచ్చితంగా పాటించిందని పుతిన్ తెలిపారు. అయితే అమెరికా లేదా మరేదైనా అణు శక్తి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి పరీక్షలు నిర్వహిస్తే రష్యా కూడా అదే మార్గంలో వెళ్తుందని ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
రష్యా-అమెరికా వద్ద అత్యధిక అణు ఆయుధాలు
1991లో సోవియట్ యూనియన్ పతనం అయినప్పటి నుండి మాస్కో ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించలేదు. ప్రపంచంలోనే అత్యధిక అణు ఆయుధ నిల్వలు రష్యా, అమెరికా వద్ద ఉన్నాయి. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ కూడా పుతిన్‌తో మాట్లాడుతూ.. రష్యా భద్రతను నిర్ధారించడానికి వాషింగ్టన్ చర్యలకు మాస్కో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అణు పరీక్షలకు సన్నాహాలు తక్షణమే ప్రారంభించడం సమంజసమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం అంతర్జాతీయంగా అణు ఆయుధాల నియంత్రణ, భద్రతపై తీవ్ర ఆందోళనలను పెంచుతోంది.
