Site icon HashtagU Telugu

46 Dead : అగ్నివిలయానికి 46 మంది బలి.. కాలి బూడిదైన 1100 ఇళ్లు

46 Dead

46 Dead

46 Dead : చిలీ దేశంలోని అడవుల్లో సంభవించిన కార్చిచ్చు కారణంగా శుక్రవారం నుంచి ఇప్పటివరకు దాదాపు 46 మంది చనిపోయారు. అధిక ఉష్ణోగ్రతల వల్లే ఈ మరణాలు(46 Dead) సంభవించాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అడవుల్లో కార్చిచ్చు  నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చిలీ నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ వార్నింగ్ జారీచేసింది.  ఈ అగ్ని విలయంలో వందలాది మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారని తెలిపాయి. 1,100 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని ప్రభుత్వం తెలిపింది. దేశంలోని ప్రముఖ టూరిజం ప్రాంతాలైన వినా డెల్‌మార్‌, వాల్పరైజో‌లలోని అడవుల్లో మంటల తీవ్రత ఎక్కువ ఉందని సమాచారం. వాల్పరైజో ప్రాంతంలోని అడవుల్లో నాలుగు చోట్ల పెద్ద కార్చిచ్చులు సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. మంటలు అంటుకున్న ప్రాంతాలకు సకాలంలో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య సిబ్బంది చేరుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. దీనివల్ల కూడా చాలామంది చనిపోయారు.  కార్చిచ్చుతో ప్రభావితమైన ప్రాంతాల నుంచి పర్యాటకులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో సెంట్రల్‌ చిలీలో ఎమర్జెనీని విధిస్తూ దేశ అధ్యక్షుడు గాబ్రియల్‌ బోరిక్‌ శనివారమే సాయంత్రమే ఓ ప్రకటన విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join

లక్ష ఎకరాల్లో అడవులు కాలిబూడిదై..

ఈ కార్చిచ్చు కారణంగా చిలీవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో అడవులు కాలి బూడిదయ్యాయి. దేశంలోని దాదాపు 92 చోట్ల అడవుల్లో ఇంకా కార్చిచ్చు యాక్టివ్‌గానే ఉంది. ఒక్క వాల్‌పరైసో  ప్రాంతంలోనే దాదాపు 7వేల హెక్టార్ల మేర అడవులు కాలిపోయాయి.చిలీ రాజధాని శాంటియాగోకు నైరుతి దిశలో ఉన్న ఎస్ట్రెల్లా, నవిడాడ్ పట్టణాల సమీపంలోని అడవుల్లో కార్చిచ్చు ధాటికి  దాదాపు 30 ఇళ్లు కాలిపోయాయి. అడవుల పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ఇళ్లను ఖాళీచేసి.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాలలో తల దాచుకుంటున్నారు.  ఈ కార్చిచ్చు కారణంగా చిలీ దేశంలోని రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. చాలా అటవీ మార్గాల్లోని అడవులు మంటల వలయంలో చిక్కుకొని ఉండటంతో వాటి మీదుగా భూతల రాకపోకలు కష్టతరంగా మారాయి.  కరువు పరిస్థితులు, ఎల్ నినో తరహా వాతావరణ మార్పులు, వడగాలుల కారణంగా ఈ విధంగా చిలీ అడవులను కార్చిచ్చు ఆవహించిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కొలంబియా, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్‌లపై కూడా ఈవిధమైన నెగటివ్ ఎఫెక్ట్ కనిపించే రిస్క్ ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read : Telangana: 4% కోటా అమలుపై సీఎంని అభ్యర్ధించిన ముస్లిం నేతలు