వికీపీడియా (Wikipedia) సర్వీసులను పాకిస్తాన్ బ్లాక్ చేసింది. దైవ దూషణకు సంబంధించిన కంటెంట్ ను తొలగించలేదన్న కారణంతో చర్యలు తీసుకుంది. ‘‘దై దూషణకు సంబంధించిన కంటెంట్లను తొలగించాలని లేదా బ్లాక్ చేయాలని వికీపీడియాను సంప్రదించాం. గతంలోనే ఫిర్యాదు చేశాం. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం’’ అని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. కోరినట్లుగా కంటెంట్ ను వికీపీడియా తొలగించలేదని, అధికారుల ముందు వివరణ ఇచ్చేందుకు హాజరుకాలేదని చెప్పింది. ‘‘దైవదూషణకు సంబంధించిన కంటెంట్ ను తొలగించకపోవడంతో ఫిబ్రవరి 1న వికీపీడియా సర్వీసులను 48 గంటలపాటు ‘డీగ్రేడ్’ చేశాం. మా ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే వికీపీడియా విస్మరించింది’’ అని పీటీఏ ట్వీట్ చేసింది.
48 గంటల గడువు కూడా ముగియడంతో వికీపీడియా (Wikipedia) సర్వీసులను బ్లాక్ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించిన తర్వాత వికీపీడియా సర్వీసుల పునరుద్ధరణ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పీటీఏ చెప్పింది. ‘సెన్సార్ షిప్ ఆఫ్ వికీపీడియా’ అనే వ్యాసాన్ని వికీపీడియా ప్రచురించింది. అందులో వికీపీడియాపై నిషేధం విధించిన చైనా, ఇరాన్, మయన్మార్, రష్యా, సైదీ అరేబియా, సిరియా, టునీషియా, టర్కీ, ఉజ్బెకిస్తాన్, వెనెజులా వంటి దేశాలను ప్రస్తావించింది.
Also Read: Oppo Reno 8T: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో రెనో 8టీ